Narendra Modi: రైలు ప్రమాద ఘటన గురించి తెలుసుకుని చాలా బాధపడ్డాను: మోదీ
- రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో మాట్లాడాను
- అక్కడ పరిస్థితులను ఆయన పర్యవేక్షిస్తున్నారు
- అన్ని రకాల సహాయ చర్యలు కొనసాగుతున్నాయి
ఈ రోజు తెల్లవారు జామున మహారాష్ట్రలోని ఔరంగాబాద్-నాందేడ్ రైల్వే మార్గంలో ఘోర రైలు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 16కి చేరింది. మరికొంత మందికి చికిత్స అందుతోంది. ఇక ఈ ఘటన గురించి తెలుసుకుని చాలా కలత చెందానని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు.
'మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో రైలు ప్రమాదంలో కొందరు ప్రాణాలు కోల్పోవడం తెలుసుకుని చాలా బాధపడ్డాను. రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో మాట్లాడాను. అక్కడ పరిస్థితులను ఆయన పర్యవేక్షిస్తున్నారు. బాధితులను ఆదుకునేందుకు అన్ని రకాల సహాయ చర్యలు కొనసాగుతున్నాయి' అని మోదీ ట్వీట్ చేశారు.
కాగా, రైలు ప్రమాదంలో గాయపడిన వారికి ఔరంగాబాద్ సివిల్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. రైలు పట్టాలపై కూలీలు ఉన్న విషయాన్ని గుర్తించిన లోకో పైలట్ రైలును ఆపడానికి ప్రయత్నించినప్పటికీ దురదృష్టవశాత్తూ ఈ ప్రమాదం చోటు చేసుకుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు.