Chandrababu: గ్యాస్ లీకేజీపై సీఎం జగన్‌ చేసిన ప్రకటన సరికాదు: చంద్రబాబు

chandrababu press meet

  • స్టిరీన్ లీక్ ఘటన గతంలో ఎన్నడూ జరగలేదు
  • కంపెనీలోని సైరన్‌ ఎందుకు మోగలేదు?
  • లాక్‌డౌన్‌ వల్లే ప్రమాదం జరిగిందా?
  • ఇలాంటి ప్రమాదాలను తేలికగా తీసుకునే విధంగా సీఎం ప్రకటన ఉంది

కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఎల్జీ పాలిమర్స్ వంటి పరిశ్రమల్లో మరిన్ని భద్రతా చర్యలు చేపట్టాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పారు. హైదరాబాద్‌లో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీడియాతో మాట్లాడుతూ.. ఈ పరిశ్రమ అత్యవసర సేవల విభాగం కిందకు రాదు కదా? అని ప్రశ్నించారు.

అలాంటప్పుడు ఇప్పుడు దీన్ని తెరవడమేంటని చంద్రబాబు నిలదీశారు. ఇలాంటి పరిశ్రమలకు అనుమతి ఇచ్చేటప్పుడు నిబంధనలు పాటించాలని చెప్పారు. జనావాసాల మధ్య ఇలాంటి పరిశ్రమలు ఉండడం సరికాదని తెలిపారు. స్టిరీన్ లీక్ ఘటన గతంలో ఎన్నడూ జరగలేదని చెప్పారు.

'ఎవరికీ ప్రాణాలు తీసే హక్కు లేదు.. ఏదైనా ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగితే కేవలం ఆ ఫ్యాక్టరీలోని కార్మికులే చనిపోయే అవకాశం ఉంటుంది. కానీ, మొదటిసారి ఏపీలో సాధారణ ప్రజలు ఇలా చనిపోయారు. ఇందుకు కారణమైన వారు ఎంతటి వారైనా వదలిపెట్టడానికి వీల్లేదు. విశాఖలో భయంకర పరిస్థితులు నెలకొన్నాయి. జనాలు చాలా భయంతో నిన్న పరుగులు తీశారు' అని చంద్రబాబు అన్నారు.

లాక్‌డౌన్‌ వల్లే ప్రమాదం జరిగిందా? అన్న విషయంపై కూడా దర్యాప్తు జరపాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే పరిశ్రమలో ఉన్న సైరన్‌ కూడా మోగలేదని ఆయన చెప్పారు. దీనిపై సీఎం జగన్‌ స్పందించిన తీరు బాగోలేదని ఆయన అన్నారు. ఇలాంటి ప్రమాదాలను తేలికగా తీసుకునే విధంగా ఆయన చేసిన ప్రకటన ఉందని చెప్పారు.

ఈ ఘటనను హైకోర్టు, ఎన్‌హెచ్‌ఆర్సీ, ఎన్జీటీ సుమోటోగా తీసుకున్నాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు. గ్యాస్‌ లీక్‌ ఘటనపై సమీక్ష చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు చెప్పారు. ఈ ఘటనపై తూతూ మంత్రంగా దర్యాప్తు చేస్తుండడం సరికాదని అన్నారు. ఈ ఘటనపై ఆయా రంగాల్లోని నిపుణులు మాత్రమే విచారణ జరపాలని సూచించారు. ఆ కంపెనీ యాజమాన్యంపై సాధారణ కేసులు మాత్రమే పెట్టడమేంటని నిలదీశారు.

  • Loading...

More Telugu News