Rahul Gandhi: లాక్ డౌన్ అనేది ఆన్/ఆఫ్ స్విచ్ కాదు: రాహుల్ గాంధీ
- లాక్ డౌన్ ప్రక్రియకు ప్రతి ఒక్కరి సహకారం అవసరమని వ్యాఖ్యలు
- రాష్ట్రాలు, ప్రజలతో కేంద్రం సమాచారం పంచుకోవాలని సూచన
- జోన్లపై మరింత స్పష్టత అవసరం అంటున్న రాహుల్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కరోనా నేపథ్యంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడంటే అప్పుడు విధించడానికి లాక్ డౌన్ అనేది ఆన్/ఆఫ్ స్విచ్ కాదని స్పష్టం చేశారు. లాక్ డౌన్ ప్రక్రియకు ప్రతి ఒక్కరి సహకారం అవసరమని, కేంద్రం ఏం చేయబోతోందో రాష్ట్రాలతోనూ, ముఖ్యంగా ప్రజలతోనూ పంచుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.
లాక్ డౌన్ ఎత్తివేత అనేది ఓ సంధికాలం వంటిదని, దానికంటూ ప్రత్యేక విధానం ఉండాలని సూచించారు. ఈ ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వ, జిల్లా అధికార యంత్రాంగాలను కూడా కేంద్రం భాగస్వాములుగా పరిగణించాలని తెలిపారు.
ఇక దేశవ్యాప్తంగా కేంద్రం కొన్ని ప్రాంతాలను రెడ్ జోన్లు, ఆరెంజ్ జోన్లు, గ్రీన్ జోన్లుగా పేర్కొంటోందని, అయితే, కొన్ని ప్రాంతాలను జాతీయస్థాయిలో రెడ్ జోన్లుగా చూపిస్తున్నా, రాష్ట్రస్థాయిలో అవి గ్రీన్ జోన్లుగా ఉన్నాయని సీఎంలే అంటున్నారని రాహుల్ గాంధీ వివరించారు. దీనిపై స్పష్టమైన విధానం అవలంబించాల్సి ఉందని కేంద్రానికి హితవు పలికారు.