Ratan Tata: 18 ఏళ్ల కుర్రాడి స్టార్టప్ లో రతన్ టాటా పెట్టుబడి!
- జనరిక్ ఆధార్ పేరిట స్టార్టప్ స్థాపించిన థాణే కుర్రాడు
- చవకగా నాణ్యమైన ఔషధాల సరఫరా
- హోల్ సేల్ మార్జిన్ లేని 'డైరెక్ట్ సప్లై' విధానం
- రతన్ టాటాను ఆకట్టుకున్న వైనం
టాటా గ్రూప్ వ్యాపారాన్ని ప్రపంచం నలుమూలలా విస్తరింపజేసిన దిగ్గజ బిజినెస్ మేన్ రతన్ టాటా ప్రస్తుతం విశ్రాంత జీవనం గడుపుతున్నారు. టాటా గ్రూప్ కార్యకలాపాల నుంచి తప్పుకున్నాక ఆయన దృష్టి సార్టప్ లపై పడింది. ఔత్సాహికులు స్థాపిస్తున్న స్టార్టప్ లలో ఏవైనా ప్రతిభావంతంగా కనిపిస్తే వాటిలో పెట్టుబడులు పెడుతూ ప్రోత్సహిస్తున్నారు. తాజాగా, జనరిక్ ఆధార్ అనే ఫార్మా రంగ స్టార్టప్ లో పెట్టుబడి పెట్టారు. ఈ స్టార్టప్ ను స్థాపించింది ఓ 18 ఏళ్ల కుర్రాడు కావడం రతన్ టాటాను అచ్చెరువొందించింది.
థాణేకు చెందిన అర్జున్ దేశ్ పాండే గతేడాది ఏప్రిల్ లో జనరిక్ ఆధార్ అనే ఫార్మా స్టార్టప్ ప్రారంభించాడు. ఈ స్టార్టప్ నాణ్యమైన జనరిక్ ఔషధాలను 80 శాతం తక్కువ ధరకే సరఫరా చేస్తుంది. ఇతర ఔషధాలు కూడా 20 నుంచి 30 శాతం చవకగా లభిస్తాయి. థాణేలోని డీఏవీ పబ్లిక్ స్కూల్ లో విద్యాభ్యాసం చేసిన అర్జున్ దేశ్ పాండే పేదలకు కూడా నాణ్యమైన ఔషధాలు అందించాలన్న ఉద్దేశంతో జనరిక్ ఆధార్ పేరిట స్టార్టప్ నెలకొల్పాడు. ఈ సంస్థ నేరుగా తయారీదారుల నుంచే ఔషధాలను కొని రిటైల్ అమ్మకందార్లకు సరఫరా చేస్తుంది. తద్వారా మధ్యలో ఉత్పన్నమయ్యే హోల్ సేల్ మార్జిన్ భారం ఈ మందులపై పడదు. దాంతో వినియోగదారుడికి తక్కువధరకే అందించే వీలుంటుంది.
ప్రస్తుతం ఈ స్టార్టప్ కు ఏడాదికి రూ.6 కోట్ల వరకు ఆదాయం వస్తున్నట్టు చెబుతున్నారు. వచ్చే మూడేళ్లలో వ్యాపారం మరింత విస్తరించే నేపథ్యంలో రూ.150 కోట్ల నుంచి రూ.200 కోట్ల వరకు ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. అయితే, ప్రస్తుతం జనరిక్ ఆధార్ స్టార్టప్ లో రతన్ టాటా ఎంత పెట్టుబడి పెట్టాడన్నది వెల్లడి కాలేదు కానీ, ఈ వ్యాపార దిగ్గజం కూడా సంస్థలో వాటాదారు అనేసరికి స్టార్టప్ మార్కెట్ వాల్యూ ఒక్కసారిగా పెరిగింది.