Liquor Sales: మద్యం అమ్మకాలను నిషేధించలేం.. ఈ విషయంలో జోక్యం చేసుకోలేం: సుప్రీంకోర్టు
- మద్యం అమ్మకాలు రాష్ట్రాల విధానపరమైన నిర్ణయం
- ఈ విషయంలో జోక్యం చేసుకోలేం
- అమ్మకాలకు ఆన్ లైన్ విధానాన్ని అనుసరించాలి
లాక్ డౌన్ కారణంగా దాదాపు 40 రోజుల తర్వాత దేశ వ్యాప్తంగా మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. ఈ నేపథ్యంలో లిక్కర్ షాపులకు మందుబాబులు ఎగబడుతున్నారు. ఈ నేపథ్యంలో మద్యం అమ్మకాలపై నిషేధం విధించాలంటూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. మద్యం కొనుగోళ్ల సమయంలో భౌతికదూరాన్ని కూడా పాటించడం లేదని ఈ పిటిషన్లలో పేర్కొన్నారు.
ఈ పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. మద్యం అమ్మకాలు రాష్ట్రాల విధానపరమైన నిర్ణయాలని... అమ్మకాలను తాము నిషేధించలేమని, ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని చెప్పింది. అయితే మద్యం అమ్మకాలకు సంబంధించి కొన్ని మార్గదర్శకాలను పాటించాలని రాష్ట్రాలకు సూచించింది. మద్యం అమ్మకాలకు ఆన్ లైన్ విధానాన్ని అనుసరించాలని... ఆన్ లైన్ ద్వారా బుక్ చేసుకున్నవారికి డోర్ డెలివరీ చేయాలని చెప్పింది.