Corona Virus: కరోనా కేసుల్లో లక్షణాలు లేని వారి సంఖ్య ఎక్కువగా ఉందని కేంద్ర బృందానికి తెలిపిన ఏపీ ప్రభుత్వం
- రాష్ట్రంలో కరోనా పరిస్థితి పరిశీలనకు కేంద్ర బృందం రాక
- ఉన్నతాధికారులతో సమావేశం
- కరోనా వివరాలు కేంద్ర బృందానికి నివేదించిన రాష్ట్ర ప్రభుత్వం
రాష్ట్రాల్లో కరోనా స్థితిగతులపై పరిశీలనకు కేంద్రం ప్రత్యేక బృందాలను పంపిస్తోంది. ఈ క్రమంలో ఓ బృందం ఏపీకి విచ్చేసింది. ఇక్కడి ఉన్నతాధికారులతో సమావేశమై రాష్ట్రంలో కరోనా వివరాలు సేకరించింది. ఈ సందర్భంగా, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర బృందానికి పలు అంశాలు నివేదించింది. కరోనా సోకుతున్న వారిలో లక్షణాలు లేని వారి సంఖ్య ఎక్కువగా ఉంటోందని కేంద్ర బృందానికి తెలిపింది. 80 శాతం మంది ఎలాంటి లక్షణాలు లేనివారేనని రాష్ట్ర ప్రభుత్వం వివరించింది.
ఈ సందర్భంగా, కరోనా బారినపడిన వైద్య, పోలీసు, పారిశుద్ధ్య సిబ్బంది వివరాలను కేంద్ర బృందానికి సమర్పించింది. వైద్య సిబ్బందిలో 67 మందికి కరోనా సోకిందని, 89 మంది ప్రభుత్వ అధికారులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని, వీరిలో పోలీస్, రెవెన్యూ, శానిటరీ, వలంటీర్, ఆశా ఉద్యోగులు ఉన్నారని నివేదించింది. రాష్ట్రంలో కరోనా వ్యాప్తిలో 37 మంది సూపర్ స్ప్రెడర్లను గుర్తించామని, వీరిలో ఒకరి వల్ల అత్యధికంగా 34 మందికి సోకినట్టు గుర్తించామని తెలిపింది.