Devineni Uma: రెండ్రోజులైనా ఎల్జీ పాలిమర్స్ సంస్థ ప్రతినిధులను ఎందుకు అరెస్ట్ చేయడం లేదో చెప్పాలి: దేవినేని ఉమ
- విచారణకు నెల రోజులు అవసరమా?
- పబ్లిక్ లయబిలిటీ ఇన్సూరెన్సు లబ్ది చేకూరుస్తారా?
- బాధితుల కోసం ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలంటూ ట్వీట్
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వైజాగ్ గ్యాస్ లీక్ ఘటనపై స్పందించారు. ఘటన జరిగి రెండ్రోజులవుతున్నా, ఇప్పటివరకు ఎల్జీ పాలిమర్స్ కంపెనీ ప్రతినిధులను ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనిపై నియమించిన హైపవర్ కమిటీలో కేంద్ర ప్రభుత్వ సంస్థలకు చెందిన ప్రతినిధులు, శాస్త్రవేత్తలు ఎవరైనా ఉన్నారా? అని ట్వీట్ చేశారు.
"అయినా, విచారణకు నెల రోజులు అవసరమా? కంపెనీని బయటి ప్రాంతాలకు తరలించడానికి ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పండి. బాధితుల సంక్షేమం కోసం స్వల్పకాలిక, దీర్ఘకాలిక చర్యలు ఏం తీసుకుంటున్నారో, బాధితులకు పబ్లిక్ లయబిలిటీ ఇన్సూరెన్సు లబ్ది చేకూర్చడానికి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పండి" అంటూ సీఎం జగన్ ను నిలదీశారు.