TMC: ఆరోపణలు నిరూపించండి, లేకపోతే క్షమాపణలు చెప్పండి: అమిత్ షాకు టీఎంసీ డిమాండ్
- పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై అమిత్ షా ఆరోపణలు
- ఖండించిన టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ
- అమిత్ షా అబద్ధాలు గుప్పిస్తున్నారని వ్యాఖ్యలు
వలస కార్మికుల రైళ్లను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అనుమతించడం లేదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆరోపించడం పట్ల తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. వలస కార్మికుల పట్ల మమతా బెనర్జీ సర్కారు అన్యాయంగా వ్యవహరిస్తోందంటూ అమిత్ షా లేఖ రాయడాన్ని టీఎంసీ తప్పుబట్టింది.
అమిత్ షా తన ఆరోపణలు నిరూపించాలని, లేకపోతే క్షమాపణలు చెప్పాలని టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ డిమాండ్ చేశారు. ఇన్ని వారాల పాటు మౌనంగా ఉన్న కేంద్రమంత్రి ఇప్పుడు అబద్ధాలు గుప్పిస్తున్నారని మండిపడ్డారు. ఇన్నాళ్లూ వలస కార్మికులను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసి ఇప్పుడు వారి గురించి మాట్లాడుతున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ హోంమంత్రిగా తన బాధ్యతలు నిర్వర్తించడంలో విఫలమైన వ్యక్తి ఇప్పుడు అవాస్తవాలు మాట్లాడుతున్నారని అభిషేక్ బెనర్జీ విమర్శించారు.