Ayurveda: వికటించిన ప్రయోగం.. తాను తయారుచేసిన 'కరోనా' మందు తాగి ప్రాణాలు కోల్పోయిన ఆయుర్వేద నిపుణుడు
- చెన్నైలో విషాద ఘటన
- కరోనా కట్టడి కోసం ఔషధం తయారీ
- తమపైనే ప్రయోగించుకున్న నిపుణుడు, సంస్థ ఎండీ
- వికటించిన ఔషధం
కరోనా నివారణ కోసం తాను తయారుచేసిన మందును తాగి ఓ ఆయుర్వేద నిపుణుడు మృతి చెందాడు. పెరుంగుడి ప్రాంతానికి చెందిన 47 ఏళ్ల శివనేశన్ చెన్నైలోని సుజాతా బయోటెక్ అనే ఆయుర్వేద సంస్థలో పనిచేస్తున్నాడు. సుజాతా బయోటెక్ సంస్థ 30 ఏళ్లుగా ఆయుర్వేద వైద్య రంగంలో ఉంది. ఈ సంస్థకు ఉత్తరాఖండ్ లోని కాశీపూర్ లో ఓ ప్లాంట్ కూడా ఉంది. శివనేశన్ అక్కడే పనిచేస్తున్నాడు.
అయితే, దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో వైరస్ ను కట్టడి చేసే ఆయుర్వేద ఔషధం తయారీకి పూనుకున్నాడు. చెన్నై వచ్చి సంస్థ ఎండీ డాక్టర్ రాజ్ కుమార్ (67) తో కలిసి ప్రయోగాలు చేపట్టాడు. మందు తయారుచేసిన తర్వాత శివనేశన్ తో పాటు సంస్థ ఎండీ కూడా ఆ మందును తాగారు. అనంతరం వారిద్దరూ తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆసుపత్రికి తరలించారు. శివనేశన్ చికిత్స పొందుతూ మరణించగా, ఎండీ రాజ్ కుమార్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు తెలిపారు.