Kodali Nani: చంద్రబాబుపై మరోసారి విమర్శలు గుప్పించిన కొడాలి నాని
- చంద్రబాబు కేవలం పేపర్ పులి మాత్రమే
- కరోనాకు భయపడి అద్దాల మేడలో దాక్కున్నారు
- గతంలో అగ్నిప్రమాదం జరిగినప్పుడు ఎల్జీ పాలిమర్స్ ను ఎందుకు మూయించలేదు?
టీడీపీ అధినేత చంద్రబాబు కేవలం పేపర్ పులి మాత్రమేనని ఏపీ మంత్రి కొడాలి నాని ఎద్దేవా చేశారు. మోదీని ఏపీకి రాకుండా అడ్డుకుంటానని గతంలో చెప్పిన చంద్రబాబు... ఇప్పుడు ఏపీకి రావడానికి మోదీనే అనుమతి అడుక్కున్నారని ఎద్దేవా చేశారు. కరోనాకు భయపడి హైదరాబాదులోని అద్దాల మేడలో చంద్రబాబు దాక్కున్నారని అన్నారు. విశాఖ గ్యాస్ లీక్ ఘటనను చంద్రబాబు రాజకీయాలకు వాడుకుంటున్నారని చెప్పారు.
1998లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఎల్జీ పాలిమర్స్ లో అగ్నిప్రమాదం జరిగిందని... అప్పుడు ఫ్యాక్టరీని ఎందుకు మూయించలేదని నాని ప్రశ్నించారు. 2017లో ఎల్జీ పాలిమర్స్ విస్తరణ ఒప్పందాన్ని మరో ఐదేళ్లు పెంచుతూ చంద్రబాబు అనుమతి ఇచ్చారని చెప్పారు.
తూర్పుగోదావరి జిల్లాలో గ్యాస్ లీకేజీలో 18 మంది చనిపోతే చంద్రబాబు రూ. 3 లక్షల వంతున నష్టపరిహారం ఇచ్చారని... ఇప్పుడు జగన్ పెద్ద మనసుతో రూ. కోటి ఇస్తున్నారని నాని అన్నారు. ప్రమాదంపై చంద్రబాబు ముగ్గురు నేతలతో కమిటీ వేశారని... ఐఏఎస్ అధికారులతో వేసిన కమిటీ పనికి రాదా? అని ప్రశ్నించారు. నిమ్మకాయల చినరాజప్ప పేకలో జోకర్ వంటి వాడని, దేవినేని ఉమా సొల్లు వాగుడుకు తప్ప మరెందుకూ పనికిరాడని, నిమ్మల రామానాయుడు పెద్ద డ్రామానాయుడని ఎద్దేవా చేశారు. రాబోయే రోజుల్లో చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదని చెప్పారు.