Hyderabad: హైదరాబాద్ కు ఐటీ కళ... తెరచుకోనున్న కంపెనీలు!
- ఐటీ కంపెనీలతో సజ్జనార్ సమావేశం
- 33 శాతం ఉద్యోగులకు మాత్రమే అనుమతి
- కంపెనీ అఫీషియల్ లెటర్ వెంట ఉండాలన్న సజ్జనార్
గడచిన 50 రోజులుగా మూతపడిన హైదరాబాద్ ఐటీ కంపెనీలు తెరచుకోనున్నాయి. అయితే, కేవలం 33 శాతం మంది మాత్రమే విధుల్లో ఉండాలి. శనివారం నాడు కంపెనీల యాజమాన్యాలతో పోలీసు కమిషనర్ సజ్జనార్ సమావేశం సమావేశం అయ్యారు. ఉద్యోగులు ఉదయం 7 గంటల నుంచి 10 గంటల మధ్య లాగిన్ కావాల్సి వుంటుందని, సాయంత్రం 3 నుంచి 6 గంటల మధ్య విధులను ముగించుకోవాలని ఆదేశించారు.
ప్రతి ఒక్కరూ సంస్థ నుంచి అఫీషియల్ లెటర్ ను తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలని, రాత్రిపూట పని చేసేందుకు అనుమతి లేదని, కంపెనీల్లో క్యాంటీన్లను కూడా తెరవకూడదని స్పష్టం చేశారు. ప్రతి కంపెనీల్లో శానిటైజేషన్, మాస్క్ లు తప్పనిసరిగా ఉండాలని, ఉద్యోగులు సామాజిక దూరం పాటించాలని కోరామని సజ్జనార్ వ్యాఖ్యానించారు.