obama: అమెరికాలో కరోనాను అదుపు చేయలేదని ట్రంప్‌పై ఒబామా అనూహ్యంగా తీవ్ర విమర్శలు
- ట్రంప్ తీరు బాగోలేదు
- నాకేంటన్న ధోరణితో పాలకులు ఉండడం సరికాదు
- స్వార్థం వంటి పోకడలు అమెరికావాసుల జీవితాల్లో భాగమయ్యాయి
- కరోనా విపత్తును మరింత గందరగోళంగా మార్చారు
కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విఫలమయ్యారని ఆ దేశ మాజీ అధ్యక్షుడు ఒబామా విమర్శలు గుప్పించారు. కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో ట్రంప్ తీరు బాగోలేదని ఆయన అన్నారు. ఆయన ఒకరితో చేసిన సంభాషణ బయటకు వచ్చింది.
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు కొన్ని నెలలే గడువు ఉన్న నేపథ్యంలో బయటకు వచ్చిన ఈ సంభాషణ ఆసక్తికరంగా మారింది. కరోనాను ట్రంప్ ఎదుర్కొంటున్న తీరు గందరగోళంగా ఉందని ఒబామా చెప్పారు. స్వార్థం, విభజన, ఇతరుల పట్ల ద్వేషం వంటి పోకడలు ప్రస్తుతం అమెరికావాసుల జీవితాల్లో భాగమయ్యాయయని ఆయన అన్నారు.
అమెరికాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఇదేతీరు కొనసాగుతోందని ఆయన తెలిపారు. ఈ పరిణామాల వల్లే తాజా సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో ప్రపంచ దేశాలు చాలా అసమర్థంగా స్పందిస్తున్నాయని చెప్పారు. కరోనా వంటి విపత్కర పరిస్థితులని ఎదుర్కోవడం ప్రభుత్వాలకు సవాలుతో కూడుకున్న విషయమని చెప్పారు. ఇటువంటి విపత్కర సమయంలో నాకేంటన్న ధోరణితో, అందరితోనూ గొడవ పెట్టుకుంటున్న పాలకులు ఉండడం ఈ విపత్తును మరింత గందరగోళంగా మార్చిందని ఒబామా అభిప్రాయపడ్డారు.