Uttar Pradesh: కూతురిని ఎత్తుకుని మహిళ 900 కిలోమీటర్ల ప్రయాణం!
- ఇండోర్ నుంచి అమేథీకి ప్రయాణం
- ఇండోర్‌లోనే ఉంటే తన కూతురికి కరోనా సోకుతుందని భయపడ్డ మహిళ
- భర్తను ఇండోర్‌లోనే వదిలేసి ఇంటికి పయనం
- మధ్యలో లారీ, ట్రక్కులను లిఫ్టు అడిగిన మహిళ
లాక్డౌన్ నేపథ్యంలో సొంత గ్రామానికి వెళ్లడానికి కూతురిని ఎత్తుకుని ఓ మహిళ 900 కిలోమీటర్ల ప్రయాణం ప్రారంభించింది. ఉత్తరప్రదేశ్‌లోని అమేథీకి చెందిన రుక్సానా బానో తన భర్త అఖ్విబ్‌తో కలిసి మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఉంటోంది. ఆమెకు నర్గీస్ (3) అనే కూతురు ఉంది.
అఖ్విబ్ ఒక హోటల్లో వెయిటర్‌గా పని చేస్తున్నాడు. రుక్సానా ఇళ్లలో పనిమనిషిగా పని చేస్తుంది. వారు సంపాదించుకున్న డబ్బులు అయిపోయాయి. కూతురి చదువు కోసం బ్యాంకులో దాచుకున్న డబ్బును తీయొద్దని ఆమె భావించింది. ఇండోర్‌లోనే ఉంటే తన కూతురు కూడా కరోనా బారిన పడుతుందేమోనని ఆమె భయపడింది.
అమేథీకి కాలినడకన ప్రయాణం ప్రారంభించింది. ఆమె భర్త ఇండోర్‌లోనే ఉన్నాడు. వారితో ఈ సమయంలో అమేథీకి రావడానికి ఒప్పుకోలేదు. ఆమె కాలినడకన ప్రయాణం ప్రారంభించగానే తనకు తెలిసిన బంధువులు కూడా తారసపడ్డారు.
వారు కూడా అమేథీలోని సొంతూరుకు వెళుతున్నారని ఆమె తెలుసుకుంది. ఆ బృందంతో కలిసి కాలినడకన ప్రయాణం ప్రారంభించింది. మధ్యలో ఓ సారి ట్రక్కు, మరోసారి లారీని లిఫ్ట్ అడిగి వారంతా కలిసి కొంత దూరం ప్రయాణించారు. చివరకు యూపీ రాజధాని లక్నోకు చేరుకున్నారు. అక్కడి నుంచి ఆమె మళ్లీ తన కూతురితో అమేథీకి కాలినడకన ఇంటికి ప్రయాణం ప్రారంభించింది.