Corona Virus: హైదరాబాద్ ఎల్బీనగర్ లో కొంపముంచిన బర్త్ డే పార్టీ... 45 మందికి కరోనా
- మిత్రుడి కోసం వేడుకలు నిర్వహించిన దుకాణదారు
- ఎల్బీ నగర్ ఏరియాలో మరింత విస్తరించి కరోనా
- 15 కంటైన్మెంట్ క్లస్టర్ల ఏర్పాటు
తెలంగాణ రాష్ట్రంలో నమోదువుతున్న కరోనా కేసుల్లో అత్యధికం జీహెచ్ఎంసీ పరిధిలోనివే. ముఖ్యంగా, వనస్థలిపురం పరిసర ప్రాంతాల్లో కరోనా స్వైరవిహారం చేస్తోంది. ఇటీవల కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన వారిలో 45 మంది ఎల్బీనగర్ ప్రాంతానికి చెందినవారేనని తెలిసింది. ఇటీవల ఓ స్టోర్ యజమాని బర్త్ డే వేడుకలు నిర్వహించడమే వైరస్ వ్యాప్తికి కారణంగా భావిస్తున్నారు. కొత్త కేసులు నమోదు కావడమే కాదు, ఎల్బీ నగర్ ఏరియాలో 15 కంటైన్మెంట్ క్లస్టర్లు కూడా ఏర్పడ్డాయి.
సదరు దుకాణదారు సరూర్ నగర్ నివాసి. మలక్ పేట్ గంజ్ లో ఆయనకు ఓ దుకాణం ఉంది. అయితే తన మిత్రుడి కోసం జన్మదిన వేడుకలు నిర్వహించాడు. అప్పటికే ఆ వ్యాపారికి తన దుకాణంలో పనిచేసే వ్యక్తి ద్వారా కరోనా సోకింది. ఈ విషయం తెలియక పార్టీలో పాల్గొనడంతో అతడి మిత్రుడికి కూడా కరోనా వ్యాప్తి చెందింది. ఆ విధంగా మొత్తం 45 మంది కరోనా బారినపడ్డట్టు అధికారులు గుర్తించారు. ఇప్పటివరకు ఆ ప్రాంతంలో రెండు కంటైన్మెంట్ క్లస్టర్లు ఉండగా, ఇప్పుడు వాటి సంఖ్య మరింత పెరిగింది.