Sramik train: కొన్ని బోగీలను వదిలేసి ముందుకు వెళ్లిపోయిన శ్రామిక రైలు!
- గుజరాత్ నుంచి ఉత్తరప్రదేశ్ కు వెళ్తున్న శ్రామిక రైలు
- 1200 మంది కార్మికులతో 23 బోగీలతో వెళ్తున్న ట్రైన్
- యూపీలో బతౌలి స్టేషన్ లో విడిపోయిన బోగీలు
లాక్ డౌన్ నేపథ్యంలో వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులను శ్రామిక రైళ్ల ద్వారా వారి సొంత రాష్ట్రాలకు తరలిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా గుజరాత్ లోని సూరత్ నుంచి పన్నెండు వందల మంది వలస కార్మికులను తీసుకుని ఉత్తరప్రదేశ్ కు శ్రామిక రైలు బయలుదేరింది. మొత్తం 23 బోగీలు ఉన్న ఈ రైలులో కేవలం మూడు బోగీలతో మాత్రమే ఆ రైలు వెళ్లిపోయింది.
ఈ సమాచారాన్ని సంబంధిత స్టేషన్ మాస్టర్ కు ఆ రైలు గార్డు తెలియజేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అదే విధంగా, వదిలేసిన బోగీల్లో ఉన్న కార్మికులు తమ బంధువులకు, మిత్రులకు ఫోన్ల ద్వారా సమాచారం పంపారు. ఎట్టకేలకు రైల్వే శాఖ అధికారులు స్పందించడంతో వదిలేసిన బోగీలను ఇంజన్ తీసుకెళ్లింది.
కాగా, యూపీలోని బతౌలి స్టేషన్ లో రైలు బోగీలు విడిపోయినట్టు సమాచారం. ఉదయం ఏడు గంటలకు ఆ బోగీలను విడిచి వెళ్లిపోయింది. మళ్లీ 11 గంటల సమయంలో ఆ రైలుకు బోగీలను తగిలించి పంపినట్టు సమాచారం.