Corona Virus: జూన్ 10 నాటికి కనీసం లక్షన్నర కరోనా కేసులు... తాజా అధ్యయనం
- గరిష్ఠంగా 5.50 లక్షల కేసులు
- సింగపూర్ మెడికల్ స్కూల్ తో కలిసి గువాహటి ఐఐటీ అధ్యయనం
- వైరస్ వ్యాప్తి అంచనాపై లెక్కలు
వచ్చే నెల రోజుల వ్యవధిలో ఇండియాలో కనీసం లక్షన్నర కరోనా కేసులు నమోదవుతాయని తాజా అధ్యయనం ఒకటి అంచనా వేసింది. సింగపూర్ కు చెందిన డూక్ - నుజ్ మెడికల్ స్కూల్, గువాహటి ఐఐటీలు సంయుక్తంగా, ఇండియాలో వైరస్ వ్యాప్తి అంచనాపై ఓ నమూనాను రూపొందించాయి. ఇందులో భాగంగా వివిధ రాష్ట్రాల్లో కేసుల నమోదును పరిశీలించి వైరస్ వ్యాప్తిపై లెక్కలు గట్టారు. రానున్న నెల రోజుల్లో కనీసం 1.50 లక్షలు, వైరస్ వ్యాప్తి అధికంగా ఉంటే గరిష్ఠంగా 5.5 లక్షల కేసులు నమోదు కావచ్చని అంచనా వేశారు.
గడచిన రెండు వారాల వ్యవధిలో కేసుల సంఖ్య ఏ మాత్రమూ తగ్గని రాష్ట్రాలను ఓ భాగంగా, కేసులు తగ్గుతున్న రాష్ట్రాలను మరో భాగంగా, యాక్టివ్ కేసులు కూడా తగ్గుతున్న రాష్ట్రాలను మరో భాగంగా తీసుకుని ఈ అంచనాను రూపొందించినట్టు గువాహటి ఐఐటీ బృందం వెల్లడించింది. రాష్ట్రాల వారీగా కేసుల పెరుగుదల, వైరస్ వ్యాప్తిపై ఆయా ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు భిన్నంగా ఉండటంతో, కేసుల అంచనా విషయంలో దేశమంతటినీ ఒకే విధంగా భావించకుండా, మూడు భాగాలు చేశామని తెలిపారు.