Anil Kumar Poluboina: రెండు రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తే ఊరుకోం: ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్
- ఏపీ జీవో 203పై తెలంగాణ రిటైర్డ్ ఇంజినీర్ల అభ్యంతరం
- తెలంగాణకు నష్టం జరిగే పనులు సీఎం జగన్ చేయరన్న అనిల్
- కొన్ని పార్టీలు వివాదం చేస్తున్నాయంటూ ఆగ్రహం
పోతిరెడ్డిపాడు, రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా 10 టీఎంసీల కృష్ణా జలాలను తరలించేందుకు ఏపీ ప్రభుత్వం జీవో నెం.203 ఇచ్చిందంటూ తెలంగాణ రిటైర్డ్ ఇంజినీర్ల సంఘం ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి విదితమే. కృష్ణా నదీ జలాలను పూర్తిగా ఏపీకి తరలించుకుపోయే కుట్ర ఇదని తీవ్ర ఆరోపణలు చేసింది.
దీనిపై ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఘాటుగా స్పందించారు. రాజకీయ ప్రయోజనాల కోసమే కొన్ని పార్టీలు వివాదం చేస్తున్నాయని మండిపడ్డారు. రెండు రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తే ఊరుకోం అని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరిగే పనులను సీఎం జగన్ చేయరని స్పష్టం చేశారు. కృష్ణా జలాల వాడకంలో రెండు రాష్ట్రాలకు స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని వివరించారు. ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు ఎవరికీ ఇబ్బంది లేకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలిపారు.