Centre: డిశ్చార్జి అయిన పేషెంట్ల నుంచి కరోనా వ్యాపిస్తున్న దాఖలాలు లేవు: కేంద్రం
- డిశ్చార్జి అయిన వారి నుంచి కరోనా సోకవచ్చని అపోహలు
- అలాంటి కేసులేవీ లేవన్న కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ
- కొత్త డిశ్చార్జి పాలసీ తీసుకువచ్చిన కేంద్రం
కరోనా సోకిన రోగులకు డిశ్చార్జి అయ్యేముందు టెస్టులు చేయకపోతే వారి నుంచి ఇతరులకు వైరస్ సోకే అవకాశం ఉందన్న భయాల నేపథ్యంలో కేంద్రం స్పందించింది. ఒకసారి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయిన రోగుల నుంచి ఇతరులకు కరోనా వ్యాప్తి చెందినట్టు దాఖలాలు లేవని స్పష్టం చేసింది. అందుబాటులో ఉన్న సమాచారాన్ని క్రోడీకరించి చూస్తే, అలాంటి కేసు ఒక్కటీ లేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కరోనా రోగులు డిశ్చార్జి అయిన తర్వాత వారం రోజుల పాటు ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉండాలని తెలిపింది.
కేంద్ర ప్రభుత్వం మే 9న కొత్త డిశ్చార్జి పాలసీ తీసుకువచ్చింది. తీవ్ర లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన వారు కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఆర్టీ-పీసీఆర్ టెస్టులో నెగెటివ్ వస్తేనే డిశ్చార్జి అవ్వాల్సి ఉంటుంది. స్వల్ప లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన వారికి మాత్రం డిశ్చార్జి అయ్యేముందు ఎలాంటి టెస్టులు అవసరం లేదని ఆ పాలసీలో పేర్కొన్నారు. సవరించిన డిశ్చార్జి విధానం మరింత సురక్షితమైనదని కేంద్రం పేర్కొంది.