Tenali: తెనాలిలో కరోనా బాధితుడిపై పోలీసు కేసు నమోదు!
- చెన్నై కోయంబేడు మార్కెట్ కు వెళ్లిన తెనాలి లారీ
- అదే లారీలో కొడుకును రప్పించిన ఓ తండ్రి
- నలుగురిపై కేసు పెట్టిన పోలీసులు
గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో కరోనా వ్యాప్తికి కారణమయ్యారన్న ఆరోపణలపై ఓ బాధితుడిని, అతని తండ్రి, వారికి సహకరించిన లారీ ఓనర్, డ్రైవర్ లపై పోలీసు కేసు రిజిస్టర్ అయింది. లాక్ డౌన్ నిబంధనలను పాటించలేదన్న కోణంలోనూ కేసు నమోదు చేసినట్టు టూ టౌన్ పోలీసు అధికారులు తెలిపారు.
వివరాల్లోకి వెళితే, ఇక్కడి ఐతా నగర్ కు చెందిన 23 సంవత్సరాల యువకుడు, చెన్నైలోని ఓ హోటల్ లో పనిచేస్తూ, హాస్టల్ లో ఉంటున్నాడు. ఈ నెల 1వ తేదీన చెన్నైలోని కోయంబేడు కూరగాయల మార్కెట్ కు తెనాలి నుంచి ఓ లారీ వెళ్లగా, లారీ డ్రైవర్ ఫోన్ నంబర్ ను తన కుమారుడికి ఇచ్చిన అతని తండ్రి, దానిలోనే తెనాలికి రప్పించాడు.
ఈ లారీ నాలుగున తెనాలికి చేరుకోగా, విషయం తెలుసుకున్న వలంటీర్లు, తొలుత ట్రూనాట్ విధానంలో అతనికి కరోనా పరీక్షలు చేయగా, పాజిటివ్ వచ్చింది. ఆపై గుంటూరులో మరోమారు పరీక్షలు చేయించగా, కరోనా నిర్ధారణ అయింది. దీంతో అతన్ని ఐసొలేషన్ కు తరలించారు. జరిగిన విషయాన్ని స్థానిక ఏఎన్ఎం పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిబంధనలు ఉల్లంఘించి ప్రయాణం సాగించడంతో పాటు, పట్టణానికి వైరస్ ను తీసుకువచ్చారన్న కారణంతో నలుగురిపైనా కేసు పెట్టామని అన్నారు. కాగా, చెన్నైలోని కోయంబేడు మార్కెట్ కరోనా వ్యాప్తి అతిపెద్ద కేంద్రంగా నిలిచిన సంగతి తెలిసిందే.