Mamata Banerjee: మహమ్మారి వైరస్ గురించి భయంకర నిజాన్ని వివరిస్తూ మమతా బెనర్జీకి యూఎస్ డాక్టర్ లేఖ!
- ఈ వైరస్ ప్రాణాలు హరించేంతటి విషం వంటిది
- వ్యాప్తిని అరికట్టకుంటే మహా ప్రమాదం
- నా రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు అలా ఉండవద్దు
- వెంటనే కఠిన చర్యలు తీసుకోండి
- మమతా బెనర్జీకి యూఎస్ కార్డియాలజిస్ట్ ఇంద్రనీల్ లేఖ
కరోనా వైరస్ ను ఎంతమాత్రమూ తక్కువగా అంచనా వేయరాదని, ఇది చూపించే ప్రభావాన్ని అర్థం చేసుకోవాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి, ఇండియన్ - అమెరికన్ హృద్రోగ నిపుణుడు టెన్నెసీ కేంద్రంగా పనిచేస్తున్న ఆసుపత్రి వైద్యులు డాక్టర్ ఇంద్రనీల్ బసూ రే ఓ లేఖను రాశారు.
ఈ వైరస్ ఎంత ప్రమాదకారో తన లేఖలో ఆయన వివరించారు. ఇది అత్యంత భయంకరమైనదని, ప్రాణాలను హరించేంతటి ఆయుధం వంటిదని ఆయన అభివర్ణించారు. దీని వ్యాప్తిని అంత సులువుగా అడ్డుకునే వీలు లేదని, వెంటనే వైరస్ మరింత మందికి వ్యాపించకుండా కఠిన చర్యలను తీసుకోవడం ద్వారా మరణాలను తగ్గించే చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.
పశ్చిమ బెంగాల్ లో కొనసాగుతున్న వైరస్ స్వభావం మిగతా కరోనా వైరస్ తో పోలిస్తే కొంత భిన్నమైనదని ఆయన అభివర్ణించారు. ఈ వైరస్ భారీ స్థాయిలో ఇన్ఫెక్షన్ కు గురి చేయదని చెబుతూనే, "పశ్చిమ బెంగాల్ లో ప్రజల సంఖ్య చాలా ఎక్కువని, జనసాంధ్రత అధికమనే నిజాన్ని గ్రహించాలి. ఓ ప్రాంతానికి వైరస్ విస్తరిస్తే, అది దావానలంలా వ్యాపిస్తుంది. వేలాది మందికి సోకుతుంది. కొన్ని ప్రాణాలు కూడా పోతాయి" అని హెచ్చరించారు.
వైరస్ వ్యాప్తిని అరికట్టాలంటే భౌతిక దూరం పాటించడం తప్పనిసరని, కేవలం దూరంగా ఉండటం ద్వారానే దీన్ని నివారించగలమని ప్రజల్లో అవగాహన పెంచాలని ఇంద్రనీల్ బసూ సూచించారు. మమతా బెనర్జీ తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా వేలాది మంది వైరస్ బారిన పడే ప్రమాదంలో ఉన్నారని, వందలాది మరణాలు సంభవించేందుకు ప్రభుత్వం కారణం కారాదని అన్నారు. లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తేనే కరోనాను కట్టడి చేసే అవకాశాలు ఉంటాయని హెచ్చరించారు.
"నేను మీకు ఒకటే విన్నవించదలచుకున్నాను. ఈ వైరస్ ఎంత ప్రమాదకారో మీరు అర్థం చేసుకోవాలి. ఇదో కిల్లింగ్ మెషీన్ వంటిదని గమనించండి. తక్షణం కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. వైరస్ వ్యాపించకుండా టెస్టింగ్, ఐసొలేషన్ తదితర చర్యలు తీసుకోవాలి. బలవంతంగానైనా లాక్ డౌన్ ను అమలు చేసి, ప్రజలను కట్టడి చేయాలి. పశ్చిమ దేశాల్లో నెలకొన్న వాస్తవ పరిస్థితులను గమనించి అయినా, తప్పనిసరిగా పాటించాల్సిన చర్యలు తీసుకోండి" అని ఆయన కోరారు.
"మీరు తీసుకునే చర్యల కారణంగా ప్రాణాలు పోయే పరిస్థితి వస్తుందని నేను భావించడం లేదు. నా రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు అలాంటి వారు కారనే నేను అనుకుంటూ ఉన్నాను. వెంటనే కఠిన చర్యలు తీసుకోండి" అని ఆయన కోరారు. కాగా, డాక్టర్ ఇంద్రనీల్, యూఎస్ లోని పలు యూనివర్శిటీల్లోనూ మెడిసిన్ విభాగంలో ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఇండియాకూ అప్పుడప్పుడూ వచ్చి పాఠాలు చెబుతుంటారు.