Botsa Satyanarayana: గ్యాస్ లీకేజ్ ప్రభావిత గ్రామాలు సాధారణస్థితికి చేరుకున్నాయి: మంత్రి బొత్స
- నిన్న రాత్రి గ్యాస్ ప్రభావిత గ్రామంలో బస చేసిన బొత్స
- ఇవాళ గ్రామంలో పర్యటించి ప్రజలతో మమేకం
- డిశ్చార్జ్ అయిన వారికి ఏడాది పాటు వైద్య సేవలందిస్తామన్న బొత్స
విశాఖపట్టణంలో గ్యాస్ లీకేజ్ ఘటనలో డిశ్చార్జి అయిన బాధితులకు ఏడాది పాటు వైద్య సేవలు అందిస్తామని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. గ్యాస్ లీకేజ్ ప్రభావిత గ్రామంలో నిన్న రాత్రి ఆయన బస చేశారు. ఇవాళ ఉదయం గ్రామంలో పర్యటించి ప్రజలతో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రభావిత గ్రామాల ప్రజలు తొంభై శాతం మంది తమ నివాసాలకు చేరుకున్నారని చెప్పారు. మూడు నెలల పాటు గ్రామాల్లో వైద్య శిబిరాలు ఉంటాయని తెలిపారు. ప్రభావిత గ్రామాల్లో ప్రజల అవసరాలు తెలుసుకుని సహాయక చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు.
సాధారణ స్థితికి ప్రభావిత గ్రామాలు చేరుకున్నాయని, ప్రజల ఆరోగ్య పరిస్థితులు తెలుసుకునేందుకు వైద్య బృందం ఏర్పాటు చేశామని, వాలంటీర్ల ద్వారా ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ ఘటనలో బాధితులు ప్రతి ఒక్కరికి నష్టపరిహారం అందజేస్తామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. పోర్టులో కంటైనర్స్ ద్వారా స్టిరీన్ రసాయనం తరలింపు కొనసాగుతోందని అన్నారు.