WhatsApp: వాట్సప్‌ వెబ్‌లో ఇకపై 50 మందితో ఒకేసారి మాట్లాడొచ్చు.. మార్పులు చేస్తోన్న కంపెనీ!

WhatsApp for web to integrate with Messenger Rooms soon

  • ఇప్పటికే ఎన్నో ఫీచర్లను తీసుకొచ్చిన వాట్సప్‌
  • వాట్సప్‌ వెబ్‌లో ఫేస్‌బుక్  'మెసెంజర్ రూమ్స్' ఆప్షన్
  • వచ్చేనెల 2 నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశం

కరోనా వల్ల ప్రపంచ దేశాలు లాక్‌డౌన్‌ విధించడంతో తమ స్నేహితులు, బంధువులు, తోటి ఉద్యోగులతో మాట్లాడుకోవడానికి చాలా మంది మొబైల్‌ యాప్‌లలో ఉండే వీడియో కాల్ సదుపాయాన్ని అధికంగా వాడేస్తున్నారు. జూమ్, గూగుల్‌ డుయో వంటి యాప్‌లలో చాలా మంది యూజర్లు ఒకేసారి గ్రూప్‌కాల్‌లో మాట్లాడుకునే అవకాశాలు ఉన్నాయి. వాట్సప్ వెబ్‌ కూడా ఇలాంటి ఫీచరునే తీసుకురావడానికి సిద్ధమైందని ఇటీవల 'వాబీటాఇన్ఫో' చెప్పిన విషయం తెలిసిందే. ఈ ఫీచర్‌‌ వాట్సప్‌లో ఎప్పుడు అందుబాటులోకి వస్తుందన్న విషయంపై స్పష్టతనిచ్చింది.

ఇప్పటికే ఎన్నో అదిరిపోయే ఫీచర్లతో తమ యాప్‌లో అనేక మార్పులు చేసిన వాట్సప్‌లో ఇకపై ఫేస్‌బుక్‌లోని ఫీచర్ 'మెసెంజర్ రూమ్స్'ను కూడా తీసుకురానుంది. వాట్సప్‌ కూడా ఫేస్‌బుక్ సంస్థకే చెందినదన్న విషయం తెలిసిందే. గత నెలలో 'మెసెంజర్ రూమ్స్' ఫీచర్‌ ఫేస్‌బుక్‌లో అందుబాటులోకి వచ్చింది.

ఇప్పుడు వాట్సప్‌లో ప్రవేశపెడుతున్న అదే ఫీచర్‌తో ఇకపై 50 మందితో ఒకేసారి వీడియో కాల్‌లో మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. ఫేస్‌బుక్ ఇప్పటికే 'మెసెంజర్ రూమ్స్' ఫీచర్ ను తీసుకొచ్చింది. ఇప్పుడు అదే ఫీచర్ వాట్సప్ వెబ్ లో ఉండనుంది. మన ల్యాప్‌టాప్‌ లేదా పర్సనల్ కంప్యూటర్‌లలో వాట్సప్ ఓపెన్ చేస్తే.. మనకు ఫైల్ అటాచ్ బటన్ ఆప్షన్ కింద మెసెంజర్ రూమ్స్ ట్యాబ్ కనపడనుంది.

మెసెంజర్ రూమ్స్ కోసం ఫేస్‌బుక్‌ లాగిన్ అవ్వాల్సిన అవసరం ఉండదు. కంప్యూటర్‌లో వాట్సప్ క్యూఆర్ కోడ్‌ సాయంతో వాట్సప్‌ వెబ్‌ను ఓపెన్‌ చేస్తే అందులో కనపడుతుంది. ఈ ఫీచర్‌ వచ్చేనెల  2 నుంచి వాట్సప్ వెబ్‌లో అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. మనం మొబైల్‌లో వాట్సప్ గ్రూప్ ఎలా అయితే క్రియేట్ చేసుకుంటామో.. అదే విధంగా వాట్సప్‌ వెబ్‌లో మెసెంజర్ రూమ్ ఏర్పాటు చేసుకుని దాదాపు 50 మందితో ఒకేసారి వీడియో కాల్‌ ద్వారా మాట్లాడుకోవచ్చు. అంతేకాకుండా ఫైల్స్ కూడా పంపుకోవచ్చు.

  • Loading...

More Telugu News