WHO: ఏడెనిమిది వ్యాక్సిన్లు ప్రభావవంతంగా కనిపిస్తున్నాయి: డబ్ల్యూహెచ్ఓ
- వాటినే అభివృద్ధి చేస్తామంటున్న డబ్ల్యూహెచ్ఓ చీఫ్
- 8 బిలియన్ డాలర్ల నిధులు సమకూర్చిన 40 దేశాలు
- ఆ నిధులు కూడా సరిపోవని వెల్లడి
ప్రపంచవ్యాప్తంగా కరోనా మృత్యు ఘంటికలు మోగిస్తున్న నేపథ్యంలో వ్యాక్సిన్ తయారీ కోసం ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. వ్యాక్సిన్ కోసం అనేక దేశాల్లో ప్రభుత్వాలు, ప్రైవేటు సంస్థలు సాగిస్తున్న పరిశోధనలను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సమన్వయం చేస్తోంది. ఈ అంశంపై డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రీసియస్ స్పందించారు. ప్రస్తుతం ఓ ఏడెనిమిది వ్యాక్సిన్ల పనితీరు ఆశాజనకంగా ఉందని తెలిపారు. 400 మంది శాస్త్రవేత్తలు ఈ పరిశోధనల్లో పాలుపంచుకుంటున్నారని చెప్పారు.
వందల సంఖ్యలో వ్యాక్సిన్లు వివిధ దశల్లో ప్రయోగశాలల్లో ఉన్నా, వాటిలో అత్యుత్తమం అనదగ్గవి ఓ 7 లేదా 8 ఉండొచ్చని అన్నారు. ప్రస్తుతం ఆ వ్యాక్సిన్లను మరింత అభివృద్ధి చేసే కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయని వివరించారు. ఇప్పటికే 40 దేశాల నుంచి 8 బిలియన్ డాలర్ల మేర నిధులు వచ్చాయని, వ్యాక్సిన్ ను సత్వరమే తీసుకురావాలంటే ఈ నిధులు సరిపోవని స్పష్టం చేశారు. వ్యాక్సిన్ ను పరిపూర్ణ దశకు తీసుకురావడమే కాదు, దాన్ని ప్రతి ఒక్కరికీ అందేలా చూడడం కూడా ముఖ్యమేనని అభిప్రాయపడ్డారు.