Nara Lokesh: మంత్రులు, ఎమ్మెల్యేలు విషవాయువులు పీల్చి చావడానికి సిద్ధమా? అని బాధితులు ప్రశ్నిస్తున్నారు: నారా లోకేశ్
- విశాఖ గ్యాస్ లీకేజ్ ఘటనలో వైసీపీ నేత వ్యాఖ్యలపై ఫైర్
- చనిపోతే రూ.కోటి వచ్చేదని ఒకరిద్దరు వ్యాఖ్యానించారన్న వైసీపీ నేత
- ఈ వ్యాఖ్యలపై బాధితులు మండిపడుతున్నారన్న లోకేశ్
విశాఖపట్టణంలో గ్యాస్ లీకేజ్ ఘటనలో మృతుల కుటుంబాలకు వైసీపీ ప్రభుత్వం కోటి రూపాయల చొప్పున నష్టపరిహారం ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో తమ ప్రాణాలు పోయినా కోటి రూపాయల చొప్పున నష్టపరిహారం వచ్చి ఉండేదని ఒకరిద్దరు అనుకున్నవారూ లేకపోలేదంటూ వైసీపీ నేత ఒకరు చేసిన వ్యాఖ్యలపై ఓ మహిళా బాధితురాలు మండిపడటాన్ని టీడీపీ నేత నారా లోకేశ్ ప్రస్తావించారు.
ఈ మేరకు ఓ ట్వీట్ తో పాటు వీడియోను పోస్ట్ చేశారు. ఈ విధంగా వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు వ్యాఖ్యలు చేస్తున్నారని, బాధితులేమో అదే కోటి రూపాయల చొప్పున ఇస్తే మంత్రులు, ఎమ్మెల్యేలు విషవాయువులు పీల్చి చావడానికి సిద్ధమా? అని బాధితులు ప్రశ్నిస్తున్నారని, ‘ఏమంటారు జగన్ గారు?’ అని ప్రశ్నించారు.