Ganesh Idol: ఈ ఏడాది ఒక్క అడుగు ఎత్తున్న విగ్రహం ప్రతిష్టించాలని ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ నిర్ణయం
- ప్రతి ఏడాది భారీ వినాయకుడ్ని ఏర్పాటు చేసే ఉత్సవ కమిటీ
- కరోనా కల్లోలంతో నిర్ణయాన్ని మార్చుకున్న వైనం
- కర్ర పూజ సైతం రద్దు
ప్రపంచంలోని అన్ని దేశాలను హడలెత్తిస్తున్న కరోనా మహమ్మారి దెబ్బకు అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ప్రతి ఏడాది హైదరాబాద్ లో భారీ వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసే ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ సైతం కరోనా ప్రభావంతో కీలక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఈ సంవత్సరం వినాయకచవితి సందర్భంగా కేవలం ఒక్క అడుగు ఎత్తున్న విగ్రహాన్ని మాత్రమే ప్రతిష్టించాలని నిర్ణయించింది. కరోనా నేపథ్యంలో భారీ ఎత్తున్న విగ్రహ ఏర్పాటును కమిటీ విరమించుకుంది. అంతేకాదు, భారీ విగ్రహ నిర్మాణం కోసం నిర్వహించే కర్ర పూజను సైతం రద్దు చేసింది. వాస్తవానికి ఈ నెల 18న కర్ర పూజ చేసి శాస్త్రోక్తంగా విగ్రహ తయారీకి ఉపక్రమించాలని భావించారు. అయితే కరోనా పరిస్థితుల కారణంగా ఉత్సవ కమిటీ షెడ్యూల్ మారిపోయింది.