Nara Lokesh: పసుపు రైతు వెతలపై సీఎం జగన్ కు లేఖ రాసిన నారా లోకేశ్
- క్వింటాకు కనీసం రూ.10 వేలు ఇవ్వాలని డిమాండ్
- ప్రభుత్వం ప్రకటించిన ధర సరిపోదని వెల్లడి
- లాక్ డౌన్ ఆంక్షలతో పసుపు రైతు నష్టపోతున్నాడని ఆవేదన
ఏపీలో పసుపు పండించిన రైతులు సమస్యల్లో కూరుకుపోయారని, గిట్టుబాటు ధరల్లేక నానా ఇబ్బందులు పడుతున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు లేఖ రాశారు. క్వింటాకు రూ.15 వేలు అయితే తప్ప పసుపుకు గిట్టుబాటు కాదని ఎన్నికల ముందు ఊదరగొట్టిన వైసీపీ ఇప్పుడెందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు.
ప్రభుత్వం పసుపు క్వింటా ధర రూ.6,850 అని ప్రకటించినా, ఆ ధర కూడా లభించని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో క్వింటాకు కనీసం రూ.10 వేలు ఇస్తే తప్ప రైతులు కోలుకునే పరిస్థితి లేదని, ఇప్పటికైనా కష్టాల్లో ఉన్న పసుపు రైతులను తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఓ వైపు లాక్ డౌన్ ఆంక్షలు, మరో వైపు అరకొర కొనుగోళ్లతో నష్టాలపాలవుతున్నారని లోకేశ్ తన లేఖలో పసుపు రైతుల వెతలను వివరించారు.