Kodandaram: కేసీఆర్, జగన్ మధ్య స్నేహానికి ఇదే కారణం: కోదండరామ్
- ఇద్దరి మధ్య రహస్య ఒప్పందాలు ఉన్నాయి
- ఆస్తులను కాపాడుకోవడమే స్నేహానికి కారణం
- రాష్ట్ర ప్రయోజనాలను కేసీఆర్ తాకట్టు పెట్టారు
ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ లపై టీజేఎస్ అధినేత కోదండరామ్ విమర్శలు గుప్పించారు. ఇరువురి మధ్య రహస్య ఒప్పందాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. ఆస్తులను కాపాడుకోవడమే ఇద్దరి మధ్య స్నేహానికి కారణమని అన్నారు. స్నేహం ప్రజల మధ్య ఉండాలి కానీ, నాయకుల మధ్య కాదని చెప్పారు.
ఒక ఒప్పందం ప్రకారమే తెలంగాణ ప్రయోజనాలను జగన్ కు కేసీఆర్ తాకట్టు పెట్టారని కోదండరామ్ మండిపడ్డారు. కృష్ణానది కింద ప్రాజెక్టులను కావాలనే కేసీఆర్ నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 203తో తెలంగాణ రైతులకు తీరని నష్టం కలుగుతుందని... ఈ జీవోపై కేసీఆర్ కావాలనే నిర్లక్ష్యం వహించారని అన్నారు. ఉమ్మడి మిత్రుడైన మేఘా సంస్థ కృష్ణారెడ్డిపై ఉన్న ప్రేమ ప్రజలపై కేసీఆర్ కు లేదని దుయ్యబట్టారు. రైతులకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగనివ్వబోమని... పోరాటం చేస్తామని తెలిపారు.