america: కరోనా వ్యాప్తి నేపథ్యంలో చైనాపై కఠిన ఆంక్షలకు సిద్ధమవుతూ బిల్లు ప్రవేశపెట్టిన అమెరికా
- కరోనాపై పూర్తి సమాచారం చెప్పకపోతే ఆంక్షలు అమలు
- 'ది కొవిడ్-19 అకౌంటబిలిటీ యాక్ట్' పేరిట బిల్లు
- ఆస్తుల్ని స్తంభింపజేయడం, ప్రయాణాలపై నిషేధాలు
- వీసా ఉపసంహరణ, అమెరికన్ స్టాక్ ఎక్స్ఛేంజీల్లోనూ నిషేధం వంటి ఆంక్షలు
కరోనా పుట్టినిల్లు చైనాపై అగ్రరాజ్యం అమెరికా మండిపడుతున్న విషయం తెలిసిందే. కరోనాపై ఇప్పటికే ప్రపంచాన్ని మభ్యపెట్టే ప్రకటనలు చేసిందని చైనాపై విమర్శలు చేస్తోన్న అమెరికా పలు చర్యలకు సిద్ధమవుతోంది. కరోనా పుట్టుక వంటి అంశాలపై అమెరికా విచారణ జరుపుతోంది. దీనిపై వివరాలివ్వని పక్షంలో చైనాపై కఠిన ఆంక్షలు విధించడానికి ఉద్దేశించిన బిల్లును తొమ్మిది మంది సభ్యులు సెనేట్‌లో ప్రవేశపెట్టారు. 'ది కొవిడ్-19 అకౌంటబిలిటీ యాక్ట్' పేరిట ఈ బిల్లును రూపొందించారు.
కరోనా వైరస్ విజృంభణలో చైనా పాత్రపై అమెరికాతో పాటు తమ మిత్రపక్షాలు, ఐక్యరాజ్యస సమితి అనుబంధ సంస్థల విచారణకు చైనా నుంచి పూర్తి సహకారం లభించాల్సిందేనని బిల్లులో పేర్కొన్నారు. వైరస్ గురించిన సమాచారాన్నంతా అందించాలని అన్నారు.
అలాగే, అమెరికాకు చైనా పూర్తి సమాచారం అందించిందా? అన్న విషయాన్ని తమ అధ్యక్షుడు ట్రంప్ 60 రోజుల్లోగా కాంగ్రెస్‌కు తెలియజేయాలని అందులో పేర్కొన్నారు. చైనాలోని జంతు విక్రయ దుకాణాలను మూసివేయాలని డిమాండ్ చేశారు. సమాచారం ఇవ్వడంలో చైనా విఫలమైతే అమెరికాలో దాని ఆస్తుల్ని స్తంభింపజేయడం, ప్రయాణాలపై నిషేధాలు, ఆ దేశానికి వీసా ఉపసంహరణతో పాటు తమ దేశ ఆర్థిక సంస్థల నుంచి రుణాలు ఇవ్వడాన్ని నిలిపేయడం, అమెరికన్ స్టాక్ ఎక్స్ఛేంజీల్లోనూ చైనా సంస్థల్ని నిషేధించడం వంటి ఆంక్షలు విధించనున్నారు.
చైనాపై ఈ ఆంక్షలు విధించేందుకు అధ్యక్షుడు ట్రంప్‌కు పూర్తి అధికారం ఉంటుందని అందులో పేర్కొన్నారు. కాగా, చైనీస్ కమ్యూనిస్టు పార్టీ ప్రమేయం లేకుండా తమ దేశానికి కరోనా వచ్చే అవకాశమే లేదని తాను పూర్తిగా నమ్ముతున్నట్లు ఆ బిల్లు రూపకర్త లిండ్సే గ్రాహం తెలిపారు. అమెరికా ప్రవేశపెట్టిన బిల్లు ద్వారా చైనాపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.