Uttam Kumar Reddy: ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ఎక్కువ నీళ్లు తీసుకెళ్తోంది: టీ-పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్
- జగన్ మాట్లాడుతున్నా కేసీఆర్ నోరుమెదపరే?
- తెలంగాణ ప్రజలకు కేసీఆర్ సంజాయిషీ ఇవ్వాలి
- ‘పోతిరెడ్డిపాడు’ విస్తరణ పనులు మొదలైతే కేసీఆర్ రాజీనామా చేయాల్సిందే
కృష్ణా జలాల్లో ఇప్పటికే ఏపీ ఎక్కువ నీళ్లు తీసుకెళ్తోందని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంపును నిరసిస్తూ హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో ఇవాళ ఆయన నిరసన దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ, కృష్ణా నదీ జలాల విషయమై ఏపీ సీఎం జగన్ మాట్లాడుతున్నా తెలంగాణ సీఎం కేసీఆర్ నోరుమెదపట్లేదని విమర్శించారు. కేసీఆర్ తో మాట్లాడే ‘పోతిరెడ్డిపాడు’ పనులు మొదలు పెడుతున్నామని వైసీపీలో కీలక నేత శ్రీకాంత్ రెడ్డి అన్న మాట వాస్తవమా? కాదా? ఈ విషయమై కేసీఆర్ స్పష్టంగా ఎందుకు పత్రికా ప్రకటన ఇవ్వలేదు? అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ సంజాయిషీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ‘పోతిరెడ్డిపాడు’ సామర్థ్యం పెంచితే మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలు ఎడారిగా మారిపోతాయంటూ ధ్వజమెత్తారు.
ఏపీ ఎన్నికల్లో జగన్ కు కేసీఆర్ ఫండింగ్ చేసినప్పటి నుంచి వీళ్లిద్దరూ ‘అలయ్ బలయ్’ అయి తిరుగుతున్నారని ఆరోపించారు. జగన్ ఇక్కడకు రావడం, కేసీఆర్ అక్కడికి వెళ్లడం, కలిసినప్పుడు నాలుగైదు గంటలు సమావేశం కావడంపై తమ కేమీ అభ్యంతరం లేదు కానీ, ‘పోతిరెడ్డిపాడు’ విస్తరణ పనులు మొదలైతే మాత్రం కేసీఆర్ నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందని అన్నారు.
ఈ ప్రాజెక్టు విస్తరణ పనులు మొదలైతే తెలంగాణ రైతాంగానికి, వ్యవసాయానికి గొడ్డలిపెట్టు లాంటిదని అన్నారు. ఇంత పెద్ద నష్టం జరగబోతోంటే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి ‘మ్యాచ్ ఫిక్సింగ్’ చేసుకుంటున్నారేమోనని ఆరోపించారు.