Vijay Malya: 100 శాతం బకాయిలు చెల్లిస్తా... కేసు మూసేయండి: విజయ్ మాల్యా వేడుకోలు
- పూర్తి డబ్బిచ్చేందుకు సిద్ధంగా ఉన్నాను
- బేషరతుగా తీసుకోవాలని విన్నపం
- ప్రస్తుతం బ్రిటన్ లో తలదాచుకున్న మాల్యా
ఇండియాలోని ప్రభుత్వ రంగ బ్యాంకులకు తాను చెల్లించాల్సిన పూర్తి మొత్తాన్ని తిరిగి చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నానని, దయచేసి ఆ డబ్బును బేషరతుగా తీసుకుని కేసును మూసివేయాలని యూబీ గ్రూప్ మాజీ చైర్మన్ విజయ్ మాల్యా వేడుకున్నాడు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టారు. ఇదే సమయంలో ప్రభుత్వం ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీపై సెటైర్లు కూడా వేశారు.
"కొవిడ్ 19 రిలీఫ్ ప్యాకేజీ ప్రకటించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు. వారు తమకు కావాల్సినంత డబ్బును ముద్రించుకోగలరు. కానీ నా వంటి చిన్న వ్యక్తి, బ్యాంకులకు చెల్లించాల్సిన 100 శాతం మొత్తాన్ని ఇస్తానంటే మాత్రం తీసుకునేందుకు అంగీకరించడం లేదు. దయచేసి నా డబ్బు బేషరతుగా తీసుకుని క్లోజ్ చేయండి" అని ట్వీట్ చేశారు.
కాగా, ఇండియాలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి వేల కోట్ల రుణాలను తీసుకున్న మాల్యా, వాటిని చెల్లించడంలో విఫలమై బ్రిటన్ కు పారిపోయిన సంగతి తెలిసిందే. అతన్ని ఎలాగైనా ఇండియాకు రప్పించేందుకు సీబీఐ, ఈడీ, బ్యాంకుల కన్సార్టియం అక్కడి కోర్టులలో పోరాడుతున్నాయి.