Rajamouli: రాజమౌళిగారు అవకాశం ఇవ్వకపోతే నా పరిస్థితి చాలా దారుణంగా ఉండేది: 'కాలకేయ' ప్రభాకర్
- మాది మహబూబ్ నగర్ జిల్లా
- జాబ్ ఇప్పిస్తానని ఒక వ్యక్తి మోసం చేశాడు
- 'మర్యాద రామన్న' మంచి పేరు తెచ్చిందన్న ప్రభాకర్
'బాహుబలి' చూసినవారు ఆ సినిమాలోని 'కాలకేయ' పాత్రను మరిచిపోలేరు. చిత్రమైన వేషధారణతో తెరపై కనిపించిన ఆ పాత్రను ప్రభాకర్ పోషించాడు. అప్పటి నుంచి ఆయనను 'కాలకేయ' ప్రభాకర్ అనే అంతా పిలుస్తుంటారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. "ఒక వ్యక్తి రైల్వేలో జాబ్ ఇప్పిస్తానని ఆశపెడితే మహబూబ్ నగర్ నుంచి హైదరాబాద్ వచ్చాను. అతను మోసం చేయడంతో, కూలి పనులు చేస్తూ రోజులు గడిపాను.
ఒకసారి 'అతిథి' షూటింగు చూడటానికి వెళితే, ఆ దర్శకుడు నన్ను చూసి చిన్నవేషం ఒకటి ఇచ్చాడు. అప్పటి నుంచి దృష్టి సినిమాల వైపుకు వెళ్లింది. రాజమౌళి గారు 'మర్యాద రామన్న' సినిమాలో నాకు అవకాశం ఇచ్చారు. నాకు డైలాగ్స్ కూడా చెప్పడం రాకపోతే , ఆయనే సొంత ఖర్చుతో శిక్షణ ఇప్పించారు. 'మర్యాద రామన్న' సినిమా నాకు గుర్తింపు తీసుకు రావడమే కాదు, నా అప్పులన్నీ తీర్చేసింది. ఆ తరువాత చేసిన 'కాలకేయ' పాత్ర నుంచి నేను వెనుదిరిగి చూసుకోలేదు. రాజమౌళి గారు నన్ను గుర్తించి అవకాశం ఇవ్వకపోతే, నా పరిస్థితి చాలా దారుణంగా ఉండేది" అని చెప్పుకొచ్చారు.