Air India: ఎయిర్ ఇండియా రెడీ... 19 నుంచి స్పెషల్ విమానాలు!
- 19 నుంచి జూన్ 2 వరకూ ప్రత్యేక విమానాలు
- ఆ తరువాత పరిస్థితిని బట్టి రెగ్యులర్ సర్వీసులు
- వివిధ నగరాల మధ్య సేవలందించనున్న ఏఐ
లాక్ డౌన్ కారణంగా వివిధ నగరాల్లో చిక్కుబడిపోయిన వారిని తరలించేందుకు ప్రభుత్వ రంగ పౌరవిమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ఈ నెల 19 నుంచి విమానాలను నడిపనుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ను కూడా విడుదల చేసింది. ప్రత్యేక విమానాలు వివిధ నగరాల మధ్య జూన్ 2 వరకూ నడుస్తాయని వెల్లడించింది. లాక్ డౌన్ 4.0 సమయంలో సంస్థ కార్యకలాపాలు పరిమితంగా మొదలవుతాయని, అన్ని సర్వీసులనూ ఇప్పటికిప్పుడు ప్రారంభించే ఉద్దేశం మాత్రం లేదని వెల్లడించింది.
న్యూఢిల్లీ నుంచి జైపూర్, బెంగళూరు, హైదరాబాద్, అమృతసర్, కొచ్చి, అహ్మదాబాద్, విజయవాడ, గయ, లక్నో నగరాలకు; ముంబయి నుంచి విశాఖపట్నం, కొచ్చి, అహ్మదాబాద్, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ నగరాలకు విమానాలు ఉంటాయని తెలిపింది. హైదరాబాద్ నుంచి ఢిల్లీ, ముంబయి నగరాలకు; బెంగళూరు నుంచి ముంబయి, ఢిల్లీ, హైదరాబాద్ నగరాలకు విమానాలు నడుస్తాయని పేర్కొంది.
విమాన ప్రయాణాలకు సంబంధించిన టికెట్లను ఆన్ లైన్ లో బుక్ చేసుకోవచ్చని, ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ ను అతి త్వరలోనే విడుదల చేస్తామని ఎయిర్ ఇండియా అధికారి ఒకరు పేర్కొన్నారు. ప్రయాణికులంతా విధిగా లాక్ డౌన్ నిబంధనలను పాటించాలని సూచించారు.