Galla Jayadev: వలస కార్మికుల కోసం ప్రత్యేక ప్యాకేజి ప్రకటించాలి: గల్లా జయదేవ్
- వలస కార్మికులు విపరీతమైన బాధలు పడ్డారని వెల్లడి
- ఆర్థికమంత్రిని అభ్యర్థిస్తున్నానంటూ ట్వీట్
- ఉపాధి, పునరావాసం కల్పించే ప్యాకేజి కావాలని సూచన
దేశంలో ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజం కోసం ప్రధాని నరేంద్ర మోదీ రూ.20 లక్షల కోట్లతో భారీ ప్యాకేజి ప్రకటించడం, ఆపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆ ప్యాకేజీలో కేటాయింపుల వివరాలు వెల్లడించడం తెలిసిందే. దీనిపై టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ స్పందించారు.
కరోనా సంక్షోభానికి ముందు నుంచే కునారిల్లుతున్న దేశ ఆర్థిక వ్యవస్థకు తాజా ప్యాకేజి ఎంతో ఊతమిస్తుందని, ప్యాకేజీలో భాగంగా ఆర్థికమంత్రి ప్రకటించిన చర్యలు ఆర్థిక రంగ పునరుజ్జీవానికి శుభారంభం పలికే విధంగా ఉన్నాయని ట్విట్టర్ లో వివరించారు. ఈ చర్యలు ప్రధాని ప్రవచించిన స్వావలంబన సిద్ధాంతానికి దన్నుగా నిలుస్తాయని భావిస్తున్నట్టు తెలిపారు.
తాజా ప్యాకేజి, ఆర్థికపరమైన చర్యలతో ఎక్కువగా లబ్దిపొందేది చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగమేనని, ఆ రంగంపై రాయితీల జల్లు కురిపించారని వెల్లడించారు. స్థానిక బ్రాండ్లకు ప్రపంచవ్యాప్త పోటీ ఎదుర్కొనే సత్తాను ఈ ప్యాకేజి అందిస్తుందని భావిస్తున్నట్టు గల్లా జయదేవ్ వ్యాఖ్యానించారు.
అయితే, వలస కార్మికులు గత కొన్నివారాలుగా చెప్పనలవిగాని బాధలు పడ్డారని, వలస కార్మికులను ఆదుకునే విధంగా వారికీ ఓ ప్రత్యేక ప్యాకేజి ప్రకటించాలని ఆర్థికమంత్రిని అభ్యర్థిస్తున్నానని పేర్కొన్నారు. వలస కార్మికులకు ఊరట కలిగించేలా ఉండడమే కాకుండా, వారికి సరైన ఉపాధి, పునరావాసం అందించేలా ఆ ప్యాకేజి ఉండాలని సూచించారు.