Woman: బోగీల మధ్య లింక్ పై కూర్చుని బాలింత ప్రయాణం... ఎందుకీ అభివృద్ధి? ఎందుకీ సంపద? అంటూ చలించిపోయిన డీసీపీ!
- లాక్ డౌన్ తో వలస కార్మికులకు తీవ్ర కష్టాలు
- ఓ తల్లి కష్టం చూసి కదిలిపోయిన హైదరాబాద్ పోలీసు అధికారి
- అన్నీ ఉన్నా ఏంచేయలేకపోతున్నానంటూ ఆవేదన
కరోనా మహమ్మారి వ్యాప్తిని నివారించేందుకు ప్రకటించిన లాక్ డౌన్ తో అందరికంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నది వలస కార్మికులే. పొట్టకూటి కోసం స్వస్థలాలను వదిలి దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలకు తరలిపోయిన వలస జీవుల పట్ల లాక్ డౌన్ పెను విఘాతంలా పరిణమించింది. ఉన్నచోట ఉపాధి లేక, సొంత ఊరికి వెళ్లే మార్గం లేక ఇన్నాళ్లు తల్లడిల్లిపోయారు. ఏ చిన్న అవకాశం దొరికినా స్వగ్రామాలకు చేరేందుకు తహతహలాడిపోయారు. చివరికి కాలినడకన వందల కిలోమీటర్ల ప్రయాణాలు చేస్తూ ప్రాణాపాయ పరిస్థితులను సైతం ఆహ్వానిస్తున్నారు.
తాజాగా, ఓ వీడియోలో పసిబిడ్డను పొదివి పట్టుకున్న ఓ బాలింతరాలు రెండు రైలు బోగీల మధ్య ఉన్న లింకుపై కూర్చుని అత్యంత ప్రమాదకర రీతిలో ప్రయాణిస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో కనిపించింది. ఈ వీడియో చూసి హైదరాబాద్ ఈస్ట్ జోన్ డీసీపీ రమేశ్ కుమార్ తీవ్రంగా చలించిపోయారు. ఎంత కష్టమొచ్చింది తల్లీ నీకు అంటూ నిలువునా కదిలిపోయారు.
"నీ అవస్థ చూసి నా మనసు తల్లడిల్లిపోతోంది. ఎందుకీ అభివృద్ధి, ఎందుకీ సంపద? నిన్ను చూస్తుంటే నాకు దుఃఖం ఆగడంలేదు. అన్నీ ఉన్నా నీకేమి చేయలేకపోతున్నా. నన్ను క్షమించు తల్లీ!" అంటూ తీవ్ర ఆవేదనతో కూడిన ట్వీట్ చేశారు.