LG Polymers: మరో పత్రికా ప్రకటనను విడుదల చేసిన ఎల్జీ పాలిమర్స్
- సియోల్ నుంచి ఒక బృందం వచ్చింది
- అన్ని అంశాలను లోతుగా విశ్లేషిస్తుంది
- బాధిత గ్రామస్తులకు సురక్ష ఆసుపత్రిలో సదుపాయాలు కల్పిస్తాం
విశాఖలో ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. ప్రమాదానికి కారణమైన ఎల్జీ పాలిమర్స్ పై నిషేధం విధించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో, ఆ సంస్థ ఈరోజు ఓ ప్రకటనను విడుదల చేసింది. ఎనిమిది మందితో కూడిన బృందం దక్షిణకొరియా సియోల్ నుంచి వచ్చిందని ప్రకటనలో తెలిపింది. ప్రమాదానికి గల కారణాలతో పాటు, పర్యావరణ అంశాలపై కూడా ఈ బృందం పూర్తి స్థాయిలో విశ్లేషిస్తుందని చెప్పింది. భవిష్యత్తు పరిణామాలపై కూడా అధ్యయం చేస్తుందని తెలిపింది.
ముందస్తు చర్యల్లో భాగంగా స్టిరీన్ ను దక్షిణ కొరియాకు తరలించేందుకు ఏర్పాట్లు చేశామని ఎల్జీ పాలిమర్స్ పేర్కొంది. గ్యాస్ లీకేజీ బారిన పడిన గ్రామాలను ఆదుకునేందుకు ప్రభుత్వ సంస్థలతో కలిసి పని చేస్తామని చెప్పింది. వారందరికీ ఆహారం, వైద్య సౌకర్యాలను అందిస్తామని తెలిపింది. ప్రజల వైద్య పరీక్షల కోసం సురక్ష ఆసుపత్రిలో అన్ని సదుపాయాలు అందిస్తామని చెప్పింది.
గ్రామాల్లో భవిష్యత్తు పరిణామాలు, ఆరోగ్య సమస్యలపై ప్రత్యేక సంస్థతో సర్వే చేయిస్తామని తెలిపింది. గ్రామస్తులు వారి సమస్యలను చెప్పుకోవడానికి 0891-2520884, 2520338 నంబర్లను ఏర్పాటు చేశామని వెల్లడించింది. [email protected] కు మెయిల్ పంపడం ద్వారా కూడా అభిప్రాయాలను తెలపవచ్చని పేర్కొంది. మరోవైపు, ఎల్జీ పాలిమర్స్ ప్రకటనను విడుదల చేయడం ఇది రెండోసారి.