KGF: కర్ణాటక కేజీఎఫ్ గనుల్లో చోరీకి యత్నం... ఊపిరాడక ముగ్గురు దొంగల మృతి!
- లాక్ డౌన్ తో మూతపడిన కేజీఎఫ్ గనులు
- నిలిచిపోయిన బంగారం వెలికితీత
- ఇనుప సామగ్రి ఎత్తుకెళ్లేందుకు వచ్చిన దొంగలు
- 100 అడుగుల లోతులో తగ్గిన ఆక్సిజన్ లభ్యత
లాక్ డౌన్ అమల్లో ఉన్న వేళ కూడా ఐదుగురు దొంగలు చోరీకి యత్నించడం, వారిలో ముగ్గురు మరణించడం కలకలం రేపింది. కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్ (కేజీఎఫ్) గనుల్లో ఈ ఘటన జరిగింది. కుప్పం సరిహద్దు ప్రాంతానికి సమీపంలో ఉన్న కేజీఎఫ్ గనుల్లో ఇనుప సామగ్రి దొంగతనం చేసేందుకు ఐదుగురు వ్యక్తులు వెళ్లారు.
వారు గనుల్లో 100 అడుగుల లోతుకు వెళ్లగా, అక్కడ ఆక్సిజన్ లభ్యత తగ్గిపోవడంతో వారు ఊపిరందక ఉక్కిరిబిక్కిరయ్యారు. వారిలో ముగ్గురు అక్కడే ప్రాణాలు వదలగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా మారింది. దొంగలు పెద్దగా కేకలు వేయడంతో పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని ఇద్దరిని రక్షించి ఆసుపత్రికి తరలించారు.
కాగా, లాక్ డౌన్ అమల్లో ఉండడంతో గత కొన్నివారాలుగా కోలార్ ప్రాంతంలో బంగారం వెలికితీత పనులు నిలిచిపోగా, కేజీఎఫ్ గనులు మూతపడి ఉన్నాయి. ఇదే అదనుగా చోరీ చేద్దామని ప్రయత్నించిన దొంగలు ప్రాణాలకే ముప్పుతెచ్చుకున్నారు.