Nirmala Sitharaman: వలస కార్మికులు, చిన్న దుకాణదార్లకు కూడా ఈ ప్యాకేజీ ఎంతో ఉపయుక్తం: నిర్మలా సీతారామన్
- ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ పేరిట ప్యాకేజి ప్రకటించిన మోదీ
- మరోసారి మీడియా ముందుకు వచ్చిన కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల
- రైతులకు మే 31 వరకు రాయితీలు పొడిగిస్తున్నట్టు వెల్లడి
ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ పేరిట ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల భారీ ప్యాకేజిపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మరోసారి అనేక వివరాలు అందజేశారు. ఈ రెండో విడత ప్యాకేజి వలస కార్మికులు, వీధుల్లో విక్రయాలు సాగించేవాళ్లకు, సన్నకారు రైతులకు ఎంతో లబ్ది చేకూరుస్తుందని వివరించారు.
పట్టణ ప్రాంతాల్లోని పేదలు, నిరాశ్రయులు, వలస కార్మికులకు కూడా ప్యాకేజిలో పెద్దపీట వేశారని, వారి సంక్షేమం కోసం భారీగా కేటాయించారని నిర్మలా సీతారామన్ తెలిపారు. వారి సహాయ శిబిరాలు, భోజన ఏర్పాట్ల కోసమే రూ.11,000 కోట్లు రాష్ట్రాలకు కేటాయించామని, నిత్యం మూడు పూటలా భోజనం అందించే ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. వలస కార్మికులకు ఇప్పటికే నగదు పంపిణీ చేయడం కూడా జరిగిందని ఆమె వివరించారు.
తగ్గింపు రేట్లతో 3 కోట్ల మంది రైతులకు ఇప్పటికే రూ.4.22 లక్షల కోట్లు రుణాల రూపంలో అందజేశామని వెల్లడించారు. సన్నకారు రైతులకు తక్కువ వడ్డీ రేటుకే రుణాలు ఇస్తున్నామని, కిసాన్ కార్డుదారులకు రూ.25 వేల కోట్ల రుణాలు తమ ప్రభుత్వ ఘనత అని నిర్మల పేర్కొన్నారు. గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులకు ప్రభుత్వం మార్చిలో రూ.29,500 కోట్లు రీఫైనాన్స్ చేసిందని అన్నారు.
ఈ రెండో ప్యాకేజి ముద్ర యోజన, గృహ కల్పన, ఉద్యోగ కల్పన రంగాలకు కూడా చేయూతనిస్తుందని తెలిపారు. అంతేకాకుండా, సకాలంలో రుణాలు చెల్లించే రైతులకు మే 31 వరకు రాయితీ పొడిగిస్తున్నట్టు చెప్పారు. గిరిజనులకు ఉపాధి కల్పించే అవకాశాలపైనా కేంద్రం ప్రత్యేకం దృష్టి సారించిందని తెలిపారు. పట్టణ స్వయం సహాయక సంఘాలకు ఇప్పటికే రూ.12 వేల కోట్లు అందించామని, పైసా పోర్టల్ ద్వారా స్వయం సహాయక సంఘాలకు రివాల్వింగ్ ఫండ్ ఇచ్చామని అన్నారు.