Kannababu: గతంలో చంద్రబాబు చేసిన తప్పునే ఇప్పుడు జగన్ కూడా చేస్తున్నారు: కన్నా లక్ష్మీనారాయణ
- భూముల వేలాన్ని తక్షణమే ఆపేయాలి
- విలువైన భూములు ప్రభుత్వ అధీనంలో ఉండాలి
- భూములు అమ్మితే భవిష్యత్ తరాలు క్షమించవు
టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన తప్పిదాలనే ప్రస్తుత సీఎం జగన్ కూడా చేస్తున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. ప్రభుత్వ భూములను వేలం వేయాలనే నిర్ణయంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
నవరత్నాలకు నిధులను సమకూర్చుకోవడం కోసం భూములను అమ్మడం సరికాదని అన్నారు. భవిష్యత్తు అవసరాలు, ప్రజా ప్రయోజనాల కోసం విలువైన భూములను ప్రభుత్వ అధీనంలోనే ఉంచాలని చెప్పారు. భూములను అమ్మితే... భవిష్యత్ తరాలు క్షమించబోవని అన్నారు. గుంటూరు, విశాఖ భూముల వేలాన్ని తక్షణమే ఆపేయాలని డిమాండ్ చేశారు. వేలానికి సంబంధించిన నోటిఫికేషన్ ను వెంటనే వెనక్కి తీసుకోవాలని అన్నారు.
భూ విక్రయాలకు సంబంధించి... తొలి విడతలో విశాఖ, గుంటూరు జిల్లాల్లోని తొమ్మిది ప్రాంతాల్లో ఉన్న భూమిని వేలం వేసేందుకు రంగం సిద్ధమైంది. ఈ నెల 29న ఈ-ఆక్షన్ ప్రక్రియ ద్వారా వేలం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ వేలంలో సమకూరే ఆదాయాన్ని నవరత్నాలు, నాడు-నేడు వంటి కార్యక్రమాల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించనుంది. ఈ వేలం ప్రక్రియను బిల్డ్ ఏపీ మిషన్ చేపట్టబోతోంది.