Uddhav Thackeray: సీఎం పదవికి ఢోకా లేదు.. శాసనమండలికి ఏకగ్రీవంగా ఎన్నికైన ఉద్ధవ్ థాకరే!

Uddhav Thackeray elected unopposed to Maharashtra Legislative Counsil

  • ఉద్ధవ్ తో పాటు మరో ఎనిమిది మంది ఏకగ్రీవంగా ఎన్నిక
  • తొలిసారి శాసనకర్తగా ఎన్నికైన ఉద్ధవ్
  • ఏప్రిల్ 24న ఖాళీ అయిన 9 స్థానాలు

మహారాష్ట్ర శాసనమండలికి ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇప్పటి వరకు ఆయన శాసనసభ, శాసనమండలి సభ్యుడు కాదన్న విషయం తెలిసిందే. సీఎంగా బాధ్యతలను చేపట్టిన 6 నెలల్లోగా ఆయన ఏదో ఒక సభకు ఎన్నిక కావాల్సిన నేపథ్యంలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.

ఇక ఆయనతో పాటు మరో ఎనిమిది మంది కూడా ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇతర సభ్యుల్లో శాసనమండలి డిప్యూటీ ఛైర్ పర్సన్ నీలం గోర్హే (శివసేన), బీజేపీ నుంచి రంజిత్ సింగ్ మోహితే పాటిల్, గోపీచంద్ పడాల్కర్, ప్రవీణ్ డాట్కే, రమేశ్ కరాడ్, ఎన్సీపీ నుంచి శశికాంత్ షిండే, అమోల్ మిత్కారీ, కాంగ్రెస్ నుంచి రాజేశ్ రాథోడ్ ఉన్నారు.

మండలిలో ఈ తొమ్మిది స్థానాలు ఏప్రిల్ 24న ఖాళీ అయ్యాయి. ఈ తొమ్మిది మంది సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. నామినేషన్ల ఉపసంహరణకు ఈ మధ్యాహ్నం 3 గంటలకు సమయం ముగిసింది. ఆ వెంటనే వీరంతా ఎన్నికైనట్టు అధికారులు ప్రకటించారు.

ఎమ్మెల్సీగా ఎన్నిక కావడంతో... శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే శాసనకర్తగా కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. బలమైన పార్టీకి అధినేతగా ఉన్నప్పటికీ ఉద్ధవ్ ఇప్పటి వరకు ఏ ఎన్నికల్లో పోటీ చేయని విషయం తెలిసిందే. ఆయన తండ్రి దివంగత బాల్ థాకరే కూడా తన జీవితంలో ఒక్కసారి కూడా ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఈ సారి మాత్రం ఉద్ధవ్, ఆయన కుమారుడు ఆదిత్య థాకరే (ఎమ్మెల్యే) ఒకేసారి శాసనకర్తలుగా ఎన్నికయ్యారు. గత ఏడాది నవంబర్ 28న ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ ప్రమాణస్వీకారం చేశారు. మరోవైపు, ఎమ్మెల్సీగా ఉద్ధవ్ ఎన్నిక కావడంతో శివసైనికులు సంబరాల్లో మునిగిపోయారు.

  • Loading...

More Telugu News