TSRTC: ఆర్టీసీ బస్సులను తిప్పడంపై తెలంగాణ రవాణా మంత్రి స్పందన
- అన్ని జిల్లాలు గ్రీన్ జోన్ లోకి వచ్చిన తర్వాత దీనిపై ఆలోచిస్తాం
- సీఎం అధ్యక్షతన జరిగే సమావేశం తర్వాత నిర్ణయం తీసుకుంటాం
- రాష్ట్ర వ్యాప్తంగా 100 కార్గో బస్సులను ఉపయోగిస్తున్నాం
ఆంధ్రప్రదేశ్ లో బస్సులను తిప్పేందుకు ఏపీఎస్ఆర్టీసీ సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో మాత్రం ఈ అంశంపై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. అయితే ఇప్పటికే లాక్ డౌన్ నిబంధనలను కొంతమేర సడలించిన నేపథ్యంలో... తెలంగాణలో కూడా ఆర్టీసీ బస్సులను తిప్పుతారనే చర్చ జరుగుతోంది. దీనిపై రవాణా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పందించారు.
అన్ని జిల్లాలు గ్రీన్ జోన్ లోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ బస్సులను తిప్పే అంశంపై ఆలోచిస్తామని పువ్వాడ చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగే అత్యున్నత స్థాయి సమావేశం తర్వాతే దీనిపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఖమ్మం జిల్లాలోని అల్లపురం కొనుగోలు కేంద్రంలో నేడు ఆర్టీసీ కార్గో సేవలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.
ఆర్టీసీ కార్గో సేవలను వ్యవసాయం, మార్క్ ఫెడ్ లకు అనుసంధానం చేశామని పువ్వాడ తెలిపారు. కొనుగోలు కేంద్రాల నుంచి మొక్కజొన్నను ఆర్టీసీ కార్గో ద్వారా మార్క్ ఫెడ్ గోదాములకు తరలిస్తున్నామని చెప్పారు. దీని కోసం రాష్ట్ర వ్యాప్తంగా 100 కార్గో బస్సులను ఉపయోగిస్తున్నామని తెలిపారు.