Jagan: ప్రకాశం జిల్లా ఘోర రోడ్డు ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతికి గురైన సీఎం జగన్
- విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న ట్రాక్టర్
- విద్యుత్ తీగలు తెగిపడిన వైనం
- విద్యుదాఘాతానికి గురైన కూలీలు
- అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్న ఏపీ సీఎం
ప్రకాశం జిల్లాలో జరిగిన ఘోర దుర్ఘటనపై ఏపీ సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. నాగులుప్పలపాడు మండలం రాపర్ల సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. పొలంలో పనిచేసి ఇంటికి వెళుతున్న మిర్చి కూలీలు ట్రాక్టర్ ప్రమాదంలో ప్రాణాలు విడిచారు. మిరప చేనులో పని పూర్తయిన తర్వాత ట్రాక్టర్ లో ఇంటికి వెళుతుండగా, ట్రాక్టర్ అదుపుతప్పి ఓ విద్యుత్ స్తంభాన్ని ఢీకొనగా, తెగిన విద్యుత్ వైర్లు కూలీలపై పడ్డాయి. దాంతో 9 మంది కూలీలు, ఒక రైతు విద్యుదాఘాతంతో మరణించారు.
ఈ ఘటన గురించి అధికారుల ద్వారా తెలుసుకున్న సీఎం జగన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పరిస్థితిని సమీక్షించాలని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులకు వెంటనే చికిత్స అందించే ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. అటు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కూడా ఈ ఘటనపై దిగ్భ్రాంతికి లోనయ్యారు.
కాగా, మృతుల్లో ఎక్కువ మంది మహిళా కూలీలే ఉన్నట్టు తెలుస్తోంది. ఘటన జరిగిన సమాచారం అందుకున్న ప్రకాశం జిల్లా జేసీ సంఘటన స్థలాన్ని సందర్శించారు. మృతుల కుటుంబీకుల రోదనలతో ఆ ప్రాంతమంతా శోకసంద్రంలా మారింది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.