Koyambedu market: ఏపీకి కోయంబేడు దెబ్బ.. మార్కెట్‌కు వెళ్లి వచ్చిన వారిలో 21 మందికి కరోనా
- కోయంబేడు మార్కెట్ బాధితుల్లో 12 మంది నెల్లూరు వాసులే
- చిత్తూరు జిల్లా వాసులు 8 మంది
- మహారాష్ట్ర నుంచి వచ్చిన వారిలో 29 మందికి సోకిన మహమ్మారి
చెన్నైలోని కోయంబేడు మార్కెట్ దెబ్బ ఏపీకి బాగానే తగిలింది. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుతున్న సమయంలో కోయంబేడు మార్కెట్‌కు వెళ్లొచ్చిన వారితో కేసులు మరిన్ని పెరిగాయి. దీనికి తోడు వలస కార్మికుల రాక కూడా కేసుల పెరుగుదలకు మరో కారణం. రాష్ట్రంలో నిన్న 68 కేసులు నమోదు కాగా, అందులో 21 కేసులు కోయంబేడు మార్కెట్‌తో సంబంధం ఉన్నవే కావడం గమనార్హం.
వీరిలో నెల్లూరు జిల్లాకు చెందిన 12 మంది, చిత్తూరు జిల్లాకు చెందిన 8 మంది, పశ్చిమ గోదావరికి చెందిన ఒకరు ఉన్నారు. ఇక, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 32 మంది కరోనా బాధితులుగా మారారు. ఒక్క మహారాష్ట్ర నుంచి వచ్చిన వారిలోనే 29 మందికి కరోనా సోకగా, ఒడిశా నుంచి వచ్చిన ఇద్దరికి, పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చిన ఒకరికి కరోనా సోకినట్టు అధికారులు తెలిపారు.