sabita indra reddy: గత అర్ధరాత్రి ఆసుపత్రిలో చేరిన తెలంగాణ మంత్రి సబిత.. ఆమె ఆరోగ్యంపై విద్యా శాఖ ప్రకటన
- అర్ధరాత్రి ఛాతినొప్పి
- బంజారాహిల్స్ లోని కేర్ ఆసుపత్రిలో చికిత్స
- ఆరోగ్యం నిలకడగా ఉందన్న వైద్యులు
- ఆందోళన చెందాల్సిన అవసరంలేదన్న వైద్య శాఖ
తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి గత అర్ధరాత్రి ఛాతినొప్పి రావడంతో ఆమెను కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆమెకు బంజారాహిల్స్ లోని కేర్ ఆసుపత్రిలో చికిత్స అందుతోంది. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై పలువురు నేతలు ఆమె కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకుంటున్నారు. ఆమె అస్వస్థతకు గురయ్యారన్న సమాచారంతో ఆమె మద్దతుదారులు, కార్యకర్తలు ఆందోళన చెందారు. ఆమె చికిత్స తీసుకుంటున్న ఆసుపత్రికి తరలివెళ్లే ప్రయత్నాలు చేశారు.
అభిమానుల్లో ఆందోళన నెలకొన్న నేపథ్యంలో విద్యా శాఖ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఆమె అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని తెలిపింది. ఆమె పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని, స్వల్ప అస్వస్థతతో ఆసుపత్రికి వెళ్లారని చెప్పింది. వైద్య పరీక్షలు నిర్వహించగా రిపోర్ట్లు నార్మల్ వచ్చాయని తెలిపింది. ఆమె మరి కొద్ది సేపట్లో డిశ్చార్జ్ అవుతారని పేర్కొంది.