Theft: కుటుంబం మొత్తం క్వారంటైన్ లో.... తాపీగా ఇల్లు దోచుకున్న దొంగలు!

Theft in house while family went for quarantine

  • ఇండోర్ లో ఘటన
  • ఓ వ్యక్తికి కరోనా సోకడంతో కుటుంబానికి క్వారంటైన్
  • రూ.12 లక్షల విలువైన వస్తువుల చోరీ!

కరోనా నేపథ్యంలో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. వాటిలో భద్రత కూడా ముఖ్యమైనదని తాజా సంఘటన చాటుతోంది. ఓ కుటుంబం కరోనా బారిన పడి క్వారంటైన్ కు వెళ్లగా, ఇదే అదనుగా దొంగలు తమ పని చక్కబెట్టుకున్నారు. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ నగరంలో జరిగిందీ ఘటన. ఆ కుటుంబంలోని ఓ వ్యక్తికి ఏప్రిల్ 6న కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆ కుటుంబాన్ని క్వారంటైన్ కు తరలించారు. వారు ఇంటికి వచ్చే లోపు దొంగలు ఇంట్లోని విలువైన వస్తువులను దోచేసుకున్నారు. ఏప్రిల్ 22న ఈ ఘటన జరిగినట్టు గుర్తించారు. మొత్తం 12 లక్షల రూపాయల విలువైన వస్తువులు చోరీకి గురైనట్టు భావిస్తున్నారు.

క్వారంటైన్ నుంచి ఎలాగో ఇద్దరు కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చి చూడగా తలుపులు బార్లా తెరిచి ఉండడంతో దొంగతనం జరిగినట్టు అర్థం చేసుకున్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ఆరంభించారు. అయితే దర్యాప్తు సరిగా సాగడంలేదంటూ ఆ కుటుంబం సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కు ట్వీట్ చేసింది. పోలీసులు మాత్రం తాము తీవ్రంగా కృషి చేస్తున్నామని, దర్యాప్తు నత్తనడకన సాగుతోందనడంలో నిజంలేదని అన్నారు. ఇక, మరో విషయం ఏంటంటే... ఆ కుటుంబం క్వారంటైన్ నుంచి ఏప్రిల్ 26న ఇంటికి రాగా, ఆ తర్వాత వారిలో నలుగురికి కరోనా పాజిటివ్ రావడంతో మళ్లీ ఆసుపత్రికి పరిగెత్తారు.

  • Loading...

More Telugu News