Sekhar Kammula: డైరెక్టర్ శేఖర్ కమ్ములకు కృతజ్ఞతలు తెలిపిన హిజ్రాలు
- హిజ్రాలకు నిత్యావసర వస్తువులను అందించిన శేఖర్ కమ్ముల
- వారు చాలా ఇబ్బంది పడుతున్నారని వ్యాఖ్య
- ఆదుకునేందుకు అందరూ ముందుకు రావాలని పిలుపు
లాక్ డౌన్ వల్ల ఇబ్బంది పడుతున్న పలువురికి సినీ దర్శకుడు శేఖర్ కమ్ముల తన వంతుగా సాయం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇప్పటికే జీహెచ్ఎంసీ, కర్నూలు పారిశుద్ధ్య కార్మికులకు మజ్జిగ, బాదంపాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా హిజ్రాలకు సాయంగా ఉండేందుకు కూడా ఆయన ముందుకొచ్చారు. హిజ్రాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అంతేకాదు, వీరికి సాయం చేయడానికి ఇతరులు కూడా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
లాక్ డౌన్ సమయంలో ట్రాన్స్ జెండర్లు చాలా ఇబ్బంది పడుతున్నారని... వారి కష్టాలను మనం ఊహించలేమని శేఖర్ కమ్ముల అన్నారు. ఉండటానికి ఇల్లు లేక, అద్దెలు కట్టుకోలేక, తినడానికి తిండి లేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజం చూపే వివక్ష వారి బాధలను మరింతగా పెంచుతోందని చెప్పారు. వారికి అడ్రస్, ఓటర్ కార్డు, రేషన్ కార్డు ఉండవని... ఆరోగ్య పథకాలు వర్తించవని తెలిపారు. వారికి సాయం చేద్దామని అన్నారు.
మరోవైపు తమకు సాయం చేసేందుకు ముందుకు వచ్చిన శేఖర్ కమ్ములకు హిజ్రాలు కృతజ్ఞతలు తెలిపారు.