Walkers: ప్రజలను నడవకుండా ఎవరూ ఆపలేరు: పిటిషన్ ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు
- నడుస్తూ స్వస్థలాలకు వెళ్తున్న ప్రజలు
- ఆహారం, నీరు అందించేలా కేంద్రాన్ని ఆదేశించాలని పిటిషన్
- దీనిపై రాష్ట్రాలే నిర్ణయం తీసుకుంటాయన్న సుప్రీం
ఎవరు నడుస్తున్నారు, ఎవరు నడవడం లేదు? అనే విషయాలను పర్యవేక్షించడం కోర్టులకు సాధ్యపడదని సుప్రీంకోర్టు తెలిపింది. లాక్ డౌన్ నేపథ్యంలో నడుచుకుంటూ స్వస్థలాలకు వెళ్తున్న వారికి ఆహారం, నీరు అందించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్ ను విచారిస్తూ సుప్రీం ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ అంశంపై రాష్ట్రాలే నిర్ణయం తీసుకుంటాయని... కోర్టు ఎందుకు నిర్ణయం తీసుకోవాలని ప్రశ్నించింది. ప్రజలు నడుస్తూ వెళ్తున్నారని, వారు ఆగడం లేదని... వారిని తాము ఎలా ఆపగలమని అడిగింది. ప్రజలను నడవకుండా ఎవరూ ఆపలేరని వ్యాఖ్యానించారు.
మహారాష్ట్రలో రైల్వే ట్రాక్ పై నిద్రిస్తున్న వలస కార్మికులపై నుంచి కార్గో రైలు పోయిన ఘటనలో 16 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనను లాయర్ ప్రస్తావించగా... వారు రైల్వే ట్రాక్ పై పడుకుంటే... ఎవరు మాత్రం ప్రమాదాన్ని ఆపగలరు? అని ప్రశ్నించింది. ఆ తర్వాత పిటిషన్ ను కొట్టేస్తున్నట్టు తెలిపింది.