Virat Kohli: వచ్చే వారం నుంచి టీమిండియా ఆటగాళ్ల ప్రాక్టీస్... ముంబయిలో చిక్కుకుపోయిన కోహ్లీ, రోహిత్
- లాక్ డౌన్ తో కుదేలైన క్రీడారంగం
- ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన క్రీడాపోటీలు
- ముంబయిలో నివాసం ఉంటున్న కోహ్లీ, రోహిత్
- నగరంలో కరోనా బీభత్సం
ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి ధాటికి క్రీడారంగం కూడా కుదేలైంది. ప్రపంచవ్యాప్తంగా ఫుట్ బాల్ లీగ్ లు, క్రికెట్ మ్యాచ్ లు, సిరీస్ లు రద్దయ్యాయి. వరల్డ్ ఈవెంట్లు కూడా వాయిదాపడ్డాయి. భారత్ లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. క్రికెటర్లు సహా ఇతర క్రీడాకారులందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే, ఇంత సుదీర్ఘకాలం ఆటగాళ్లు మైదానంలో అడుగుపెట్టకపోతే వారిలో మందకొడితనం ఆవహిస్తుందని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) భావిస్తోంది. అందుకే నాలుగో విడత లాక్ డౌన్ లో భారీ సడలింపులు లభిస్తే ఆటగాళ్లకు అవుట్ డోర్ ప్రాక్టీసు కల్పించేందుకు సన్నాహాలు చేస్తోంది.
టీమిండియా ఆటగాళ్లు దేశంలోని వివిధ ప్రదేశాల్లో ఉండగా, వారికి అనుకూలమైన చోటే ట్రైనింగ్ సెషన్లు ఏర్పాటు చేయనున్నారు. కానీ, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, స్టార్ బ్యాట్స్ మన్ రోహిత్ శర్మ మాత్రం ముంబయిలో ఉన్నారు. వారిద్దరూ ముంబయిలోనే నివాసం ఉంటారన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ముంబయిలో కరోనా రక్కసి కరాళ నృత్యం చేస్తోంది. ఇప్పటికే అక్కడ 1000కి పైగా మరణాలు సంభవించాయి. దేశం మొత్తం నమోదైన కరోనా మరణాల్లో సింహభాగం ఇక్కడే సంభవించాయి. ఈ నేపథ్యంలో ముంబయిలో ఇప్పట్లో లాక్ డౌన్ ఎత్తివేసే పరిస్థితి లేదు. దాంతో కోహ్లీ, రోహిత్ శర్మ మైదానంలోకి వచ్చి ప్రాక్టీసు చేసుకోవడం కష్టమేనని బీసీసీఐ వర్గాలు భావిస్తున్నాయి.
దీనిపై బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ స్పందిస్తూ, కోహ్లీ, రోహిత్ మరికొంతకాలం ముంబయిలోనే లాక్ డౌన్ లో ఉండక తప్పదని అన్నారు. ఇతర ప్రాంతాల్లో లాక్ డౌన్ సడలిస్తే తమ ఆటగాళ్లకు నైపుణ్యాభివృద్ధి కోసం ప్రత్యేక శిక్షణ ఇవ్వాలనుకుంటున్నామని చెప్పారు.