Rajasthan: 'సారీ.. మీ సైకిల్ చోరీ చేసి.. మా గ్రామానికి వెళ్తున్నాను' అంటూ చీటీ రాసి వెళ్లిన వలస కూలీ!
- రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో ఘటన
- ఇతర వస్తువులేవీ చోరీ చేయని కూలీ
- ఇంటికి వెళ్లేందుకు మరో మార్గం లేదని చీటీ
- బరేలీ వెళ్లాల్సి ఉందని వ్యాఖ్య
లాక్‌డౌన్ విధించడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వలస కూలీలు తిరిగి తమ సొంత గ్రామాలకు వెళుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నడిచి వెళ్లలేక, ప్రభుత్వం సాయం అందక అవస్థలు పడుతున్న ఓ కార్మికుడు తాను ఇన్ని రోజులు ఉన్న వీధిలోని ఒకరి సైకిల్‌ను చోరీ చేశాడు. దానిపై తన గ్రామానికి బయలుదేరాడు.
అయితే, ఇక్కడే సదరు కార్మికుడు తన నిజాయతీని ప్రదర్శించాడు. చోరీ చేసే సమయంలో ఓ చీటీ రాసి, సైకిల్ యజమానికి సారీ చెప్పాడు. రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. తాను ఇంటికి వెళ్లేందుకు మరో మార్గం లేదని, తనకు ఓ కుమారుడు ఉన్నాడని, తాను అతడి కోసమే ఇలా చేయాల్సి వచ్చిందని ఆ చీటీలో పేర్కొన్నాడు.
తన కుమారుడు వికలాంగుడని, నడవలేడని తెలిపాడు. తాము బరేలీ వెళ్లాల్సి ఉందని అందులో రాసుకొచ్చాడు. అయితే, అతడు చేసిన చోరీపై ఆ సైకిల్ యజమాని సహబ్ సింగ్ సానుకూలంగా స్పందించాడు. తన సైకిల్ అవసరమైన వారికి ఉపయోగపడినందుకు సంతోషిస్తున్నానని చెప్పాడు. ఇతర వస్తువులేవీ చోరీ చేయలేదని అన్నాడు.