Shoaib Akhtar: హర్భజన్ మాతో కలిసి తింటాడు, మాతో కలిసి తిరుగుతాడు... అయినా గొడవపడేవాడు: షోయబ్ అక్తర్
- 2010 ఆసియాకప్ సంఘటన వివరించిన అక్తర్
- పాక్ పై సిక్స్ కొట్టి గెలిపించిన హర్భజన్
- ఆ మ్యాచ్ లో భజ్జీ తనతో గొడవపడ్డాడని అక్తర్ వెల్లడి
- హోటల్ రూమ్ కెళ్లి భజ్జీని కొట్టాలనుకున్నానని వ్యాఖ్యలు
టీమిండియా మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ మైదానంలో ఎంతో దూకుడుగా ఉంటాడన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా పాకిస్థాన్ తో మ్యాచ్ అంటే భజ్జీ బాడీ లాంగ్వేజిలో మార్పు కనిపిస్తుంది. ఈ విషయం గురించి పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ వెల్లడించాడు. ఓసారి హర్భజన్ ను రూమ్ కెళ్లి కొడదామన్నంత ఆవేశం వచ్చిందని వివరించాడు.
2010లో శ్రీలంకలో జరిగిన ఆసియా కప్ మ్యాచ్ లో భారత్, పాక్ మధ్య హోరాహోరీ పోరు సాగింది. హర్భజన్ చివరి ఓవర్లో సిక్స్ కొట్టి టీమిండియాను గెలిపించాడు. ఆ మ్యాచ్ లోనే అక్తర్ బౌలింగ్ లో భజ్జీ ఓ భారీ సిక్స్ కొట్టాడు. దాంతో అక్తర్ రగిలిపోవడమే కాదు, భజ్జీ శరీరానికి గురిపెట్టి బౌన్సర్లు వేశాడు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. భజ్జీ మాటలతో తన కోపం నషాళానికి అంటిందని, హోటల్ రూమ్ కు వెళ్లి కొట్టాలన్నంత ఆవేశం వచ్చిందని అక్తర్ తాజాగా ఓ వీడియోలో తెలిపాడు.
అయితే ఆ తర్వాత రోజు భజ్జీ వచ్చి సారీ చెప్పడంతో తాను చల్లబడ్డానని వివరించాడు. హర్భజన్ విచిత్రమైన వ్యక్తి అని, తమతో కలిసి తింటాడని, లాహోర్ లో తమతో కలిసి తిరుగుతాడని, అయినా తమతో గొడవ పడుతుంటాడని అక్తర్ చెప్పాడు. హర్భజన్ పంజాబీ కావడంతో, తమ సంప్రదాయాలు ఒకేలా ఉంటాయని తెలిపాడు.