Rupa Ganguly: నిజజీవితంలోనూ తనకు వస్త్రాపహరణం జరిగిందన్న టీవీ 'ద్రౌపది'!
- సూపర్ హిట్ గా నిలిచిన మహాభారత్ సీరియల్
- ద్రౌపదిగా అలరించిన రూపా గంగూలీ
- రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తనపై దాడి జరిగిందని వెల్లడి
భారత టెలివిజన్ రంగంలో మహాభారత్ సీరియల్ ఎప్పటికీ అగ్రస్థానంలో ఉంటుంది. వినోద ప్రధాన చానళ్లు పెద్దగా లేని రోజుల్లో దూరదర్శన్ లో ప్రసారమైన మహాభారత్ అత్యంత ప్రజాదరణ పొందింది. ఇటీవల లాక్ డౌన్ సందర్భంగా రీ టెలికాస్ట్ చేసినా కూడా రేటింగ్స్ అదిరిపోయాయి.
ఇక అసలు విషయానికొస్తే, మహాభారత్ సీరియల్లో ద్రౌపది పాత్రతో బెంగాలీ నటి రూపా గంగూలీ విశేషమైన ప్రజాదరణ పొందింది. ఆ సీరియల్లో వస్త్రాపహరణం సన్నివేశాల్లో ద్రౌపది నిస్సహాయతను ఆమె అద్భుతంగా పలికించింది. అయితే, తనకు నిజజీవితంలోనూ వస్త్రాపహరణం తరహా ఘటన ఎదురైందని రూపా వెల్లడించారు.
రూపా గంగూలీ ప్రస్తుతం బీజేపీ రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నారు. అయితే, తాను రాజకీయాల్లో ప్రవేశించిన సమయంలో 2016లో మరో వర్గం వ్యక్తులు తనపై దాడి చేశారని వివరించారు. కోల్ కతా లోని డైమండ్ హార్బర్ వద్ద తనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారని, తనను నేలకేసి విసిరికొట్టారని, చీర లాగేశారని వెల్లడించారు. తన తలను కారుకేసి కొట్టారని, దాంతో ఓ కన్ను పోయినంత పనైందని వివరించారు. ఆ గాయాలతో అలాగే కారు డ్రైవ్ చేసుకుంటూ ఆసుపత్రికి వెళ్లానని, కళ్లు సరిగా కనిపించకపోవడంతో కార్లో ఉన్న మహిళా కార్యకర్తలు సూచనలు ఇస్తుంటే కారు నడిపానని ఆ చేదు ఘటనను గుర్తు చేసుకున్నారు.
ఆనాటి దాడి ఫలితంగా ఇప్పటికీ ఓ కన్ను సరిగా కనిపించదని ఆవేదన వ్యక్తం చేశారు. గాయాలు తగ్గినా, నాటి దాడి ఘటన తన మనోఫలకంపై అలాగే నిలిచిపోయిందని రూపా గంగూలీ పేర్కొన్నారు.